కేసీఆర్‌...జ‌గ‌న్ గురించి ప‌వ‌న్ సంచలన వ్యాఖ్యలు

September 24, 2020

తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులైన కే చంద్ర‌శేఖ‌ర్ రావు, వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిల మ‌ధ్య ఉన్న స‌ఖ్య‌త‌ గురించి కొత్త‌గా ప‌రిచ‌యం చేయ‌న‌వ‌స‌రం లేదు. ఈ ఇద్ద‌రు సీఎంలు అనూహ్య రీతిలో దోస్తీ కుద‌ర్చుకొని ప‌నిచేస్తున్న తీరు చ‌ర్చ‌నీయాంశంగా మారిన‌ట్లే...ఈ ఇద్ద‌రు నేత‌ల ప‌నితీరు కూడా స‌హ‌జంగానే...విశ్లేష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ప‌రిపాల‌న‌, రాజ‌కీయ అంశాలలో వీరి తీరును బేరీజు వేసుకుంటున్నారు. తాజాగా ఇదే కోణ‌లో...ఈ ఇద్ద‌రు సీఎంల తీరును జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌రంగా విశ్లేషించారు. వైసీపీ ప్రభుత్వ వైఖరి తెలంగాణ ప్రభుత్వ అప్రజాస్వామిక నిర్ణయాన్ని తలదన్నేలా ఉందని మండిప‌డ్డారు.
హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధ్యక్షతన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలనాపరంగా, రాజకీయంగా నెలకొన్న పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. ఇసుక కొరత, రాజకీయ కక్ష సాధింపు చర్యలు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు, ఎన్నికల హామీల అమలులో వెనకడుగు,  లోపభూయిష్టమైన మద్యం విధానం అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సంద‌ర్భంగా అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించేందుకు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ చర్యల వల్ల‌ సుమారు రెండున్నర లక్షల మంది రోడ్డునపడే పరిస్థితి నెలకొందని సభ్యులు ప్రస్తావించారు. "48 వేలమంది ఆర్టీసీ కార్మికులను  తొలగించాలని తీసుకున్న తెలంగాణ ప్రభుత్వ అప్రజాస్వామిక నిర్ణయాన్ని తలదన్నేలా అంతకు అయిదింతలు... 2.5లక్షల మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని తొలగించేలా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది`` పవన్ కల్యాణ్ ఈ సంద‌ర్భంగా విమర్శించారు. రెగ్యులరైజ్  చేయమని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు కోరుతున్న తరుణంలో ఈ విధమైన నిర్ణయం సరికాదన్నారు.
కాగా,ఇసుక స‌మ‌స్య విష‌యంలో ప‌వ‌న్  కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. "ఇసుక సరఫరా ఇప్పటికీ సక్రమంగా లేకపోవడంతో 35 లక్షల మంది నెలల తరబడి ఉపాధికి దూరమైపోయి తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. రాజధాని ప్రాంతంలో ఇసుక స్టాక్ పాయింట్ దగ్గర పరిస్థితులు చూస్తే ప్రభుత్వం ఈ విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమైంది. అక్కడకు వచ్చిన భవన నిర్మాణ కార్మికులు ఉపాధి దొరకడం లేదని ఎంతో ఆవేదన చెందారు. ఈ రంగం చుట్టూ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో వ్యాపారాలు నడుస్తుంటాయి. వాటిలో ఎంతోమందికి ఉపాధి ఉంది. వీళ్లంతా రోడ్డునపడ్డారు. భవన నిర్మాణ కార్మికుల ఆవేదన అందరికీ తెలియాలి. అందుకు అనుగుణంగా విశాఖపట్నంలో లాంగ్ మార్చ్ చేద్దాం. ఉత్తరాంధ్ర నుంచే ఎక్కువ మంది కూలీలు భవన నిర్మాణ రంగం మీద ఆధారపడి ఉన్నారు. మన కార్యక్రమాల ద్వారా ప్రభుత్వంలో చలనం రావాలి" అన్నారు.