పవన్ కళ్యాణ్‌కు జేపీ మద్దతు! కానీ..

September 22, 2020

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తుండటాన్ని తప్పుబడుతూ సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఆ పార్టీకి దూరమయ్యారు. తన జీవితం రాజకీయాలకే అంకితమని, ఇప్పుడు మాట మార్చారని, అందుకే తాను జనసేనను వీడినట్లు చెప్పారు. దీనిపై పవన్ కళ్యాణ్ గట్టి కౌంటరే ఇచ్చారు. తనకు సిమెంట్ ఫ్యాక్టరీలు లేవని, కంపెనీలు లేవని, తన పార్టీ కోసం, కుటుంబం కోసం తనకు సినిమాలు తప్ప మరో మార్గం లేదన్నారు.

పవన్ సినిమాల అంశంపై లక్ష్మీనారాయణకు భిన్నంగా లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ స్పందించారు. జనసేనానికి అనుకూలంగానే మాట్లాడారు. పవన్ చేసిన దాంట్లో తప్పులేదని, ఆయన ఓ సినిమా హీరో కాబట్టి సినిమాల్లో నటిస్తే డబ్బులు వస్తాయని, వాటిని వదిలేసి రాజకీయ ఆరంగేట్రం చేశారని, పార్టీ కోసం, కుటుంబం కోసం మేకప్ వేసుకోవడం తప్పేం కాదన్నారు. నిజాయితీగా, గౌరవప్రదంగా సంపాదించుకుంటే సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. పార్టీని కాపాడుకునేందుకో, తన చుట్టూ ఉన్నవారి భవిష్యత్తుకో సినిమాల్లో నటించడంలో తప్పులేదన్నారు. మాజీ జేడీకి భిన్నంగా స్పందించారు.

సినిమా విషయంలో పవన్ నిర్ణయాన్ని చాలామంది సమర్థిస్తున్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే గతంలో ఫ్యాక్ట్ కమిటీ విషయంలో జేపీ చేసిన వ్యాఖ్యలకు, నేడు లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలకు పెద్ద తేడా లేదని చెబుతున్నారు.

కేంద్రం నుంచి ఏ మేరకు నిధులు వచ్చాయి, ఏపీ ప్రభుత్వం చెబుతోన్న దాంట్లో వాస్తవమెంత అని తెలుసుకునేందుకు రెండేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ (JFC) వేసారు. ఈ కమిటీ రెండుమూడుసార్లు భేటీ అయింది. ఓ సమయంలో JFC విషయంలో జేపీ విమర్శలు గుప్పించారు. ఈ కమిటీపై పవన్ మొదట చూపిన శ్రద్ధ ఇప్పుడు కనిపించడం లేదని, ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదని, నిధులపై హడావుడి చేసి సైలెంట్ అయ్యారని జనసేనానిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాదు JFC నివేదిక తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెబుతూ తానే స్వతంత్ర నిపుణుల కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఇక్కడ, ప్రస్తుతం పవన్ సినిమాల్లో నటించడం సరైనదే కావొచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మేధావులుగా.. నిజాయితీపరులైన అధికారులుగా కొనియాడబడుతున్న వారు వేర్వేరు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధిని శంకించారనే విషయాన్ని ప్రత్యర్థి పార్టీలు గుర్తు చేస్తున్నాయి. JFCపై పవన్‌కు శ్రద్ధ లేదని నాడు జేపీ వ్యాఖ్యానించగా, ఇప్పుడు సినిమాల పేరుతో రాజకీయాలపై శ్రద్ధ తగ్గించారని మాజీ జేడీ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. కానీ పార్టీ ఫండ్ కోసం ప్రస్తుతం జేపీ.. జనసేనాని వాదనతో ఏకీభవిస్తున్నారు.