రెడ్డి వచ్చాడు... కానీ మళ్లీ మొదలుపెట్టలేదు

September 22, 2020

పోలవరం ప్రాజెక్టు పనులు సుమారు నెల రోజులుగా ముందుకు సాగలేదు. కచ్చితంగా చెప్పాలంటే అక్టోబరు 21 నుంచి అక్కడ అంగుళం పని కూడా జరగలేదు. కొత్త కాంట్రాక్టు చేతికొచ్చి 15 రోజులైనా ప్రధాన పనులు, ఎడమ కాలువపై వంతెన పనులు, కుడి, ఎడమ ప్రధాన కాలువల పనులేవీ మొదలు కాలేదు. రీయంబర్స్‌మెంట్ నిధులు వస్తే తప్ప ముందుకు కదిలే అవకాశం లేదని చెబుతున్నారు.
కొత్త కాంట్రాక్టు సంస్థకు సంబంధించిన లావాదేవీలన్నీ పూర్తయ్యాయి. బ్యాంకు గ్యారంటీలు తీసుకుని, మొబిలైజేషన్ ప్రక్రియలు పూర్తవుతున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో పోలవరం నిధులకు సంబంధించి ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు సాధిస్తేనే పనులు జరిగేలా ఉన్నాయి.
పోలవరం ప్రాజెక్టు పనుల జోరు ఆగిపోయి ఆరు నెలలు కావస్తోంది. ఇప్పటి వరకు పరిశీలిస్తే మొత్తం ప్రాజెక్టు 67.09 శాతం పూర్తయింది. హెడ్‌వర్క్స్ 58.50 శాతం, మెయిన్ డ్యామ్ ప్యాకేజీ 61.06 శాతం పూర్తయింది. స్పిల్ వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్, లెఫ్ట్ ఫ్లాంక్ మట్టి పనులు 86.65 శాతం, స్పిల్ వే, స్టిల్లింగ్ బేసిన్, స్పిల్ ఛానల్ క్రేవిస్ ఫిల్లింగ్ కాంక్రీటు పని 79.04 శాతం పని పూర్తయింది. రేడియల్ గేట్స్ 70.06 శాతం, ఎగువ కాఫర్ డ్యామ్ 61.19 శాతం, దిగువ కాఫర్ డ్యామ్ 34.54 శాతం పనులు పూర్తయ్యాయి. కనెక్టవిటీ ప్యాకేజీలో 39.80 శాతం, ఎడమ కనెక్టవిటీలు 28.28 శాతం, కుడి కనెక్టవిటీల్లో 56.27 శాతం, ఎడమ ప్రధాన కాలువ 91.69 శాతం, కుడి ప్రధాన కాలువ 69.96 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. పోలవరానికి నిధులు సాధించుకోవడమన్నది పార్లమెంటు వేదికగా వైసీపీ ఎంపీల పని.. ఈ విషయంలో వారు ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది చూడాలి.