మోడీ ఇచ్చిన సలహాను బయటపెట్టిన ప్రభాస్

September 23, 2020

సుదీర్ఘ కాలం షూటింగ్ జరుపుకున్న ప్రభాస్ సాహో ఆగస్టు 30న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అత్యధిక స్క్రీన్లలో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. అనంతపురం కుర్రాడు సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్‌.

భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాను లాభాల్లో తెచ్చే బాధ్యతను ప్రభాస్ తన భుజాలపై ఎత్తుకున్నారు. నిర్మాతలు తన స్నేహితులే అని ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకే ఏ మీడియాను వదలడం లేదు. బాహుబలి సమయంలో ఈనాడు వంటి మీడియాకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెనుకాడి కేవలం నేషనల్ మీడియాను టార్గెట్ చేసిన ప్రభాస్ ఇపుడు చిన్ని చిన్న యూట్యూబు ఛానెల్స్ కూడా కూడా నేరుగా ఇంటర్వ్యూలు ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. సినిమా మాత్రమే కాకుండా రాజకీయం నుంచి పెళ్లి వరకు అన్ని టాపిక్ లపై ఓపిగ్గా సమాధానాలు చెబుతున్నారు.

ఈ సందర్భంగా ఆయన మోడీ తనకు ఇచ్చిన ఒక ఆసక్తికరమైన సలహాను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.  బాహుబలి సమయంలో ప్రధాని మోడీని కలిసినపుడు మనతో పోలికతో కొన్ని ముస్లిం దేశాలను మోడీ సూచించి అక్కడ షూటింగ్ చేయాలని చెప్పారట. అక్కడ లొకేషన్లు చాలా బాగున్నాయని అన్నారట. ఆ విషయాలను ఇంతకాలం తనలో దాచుకున్న ప్రభాస్ తాజాగా బయటపెట్టారు. బాహుబలి గురించి మోడీ చాలా ఆసక్తిగా వినడం మాత్రమే కాకుండా మంచి సలహాలు కూడా ఇచ్చారన్నారు. అయితే, మోడీ చెప్పిన లొకేషన్లలో తాము సాహో సినిమాను చిత్రీకరించలేకపోయామని... దానికి ఈ కథ అనుకూలమైనది కాదని అన్నారు.
ప్రభాస్ స్పందిస్తున్న తీరు అందిరినీ ఆశ్చర్య చకితులను చేస్తోంది. అయితే... ఇదంతా చూస్తే ఒక విషయం అర్థమవుతోంది. వీలైనంత త్వరగా నిర్మాతలను, బయ్యర్లను మర్యాదగా బయటపడేయాలని ప్రభాస్ ఫిక్సయ్యాడు.