ప్రియాంకగాంధీ కూడా ఇలా చేస్తోందేంటి?

September 21, 2020

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ సైతం మిగ‌తా రాజ‌కీయ‌ నాయ‌కుల జాబితాలో చేరారా?  వివాదాల‌తోనే...ప్ర‌జాద‌ర‌ణ‌ను పొందాల‌ని చూస్తున్నారా? అనే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది. దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టిస్తున్న సీఏఏ వ్యతిరేక నిరసన ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో ఊహించ‌ని ఘ‌ట‌న జ‌రిగింద‌ని, ఉత్తరప్రదేశ్‌ పోలీసులు తనపై చేయిచేసుకున్నారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ సంచలన ఆరోపణలు చేయ‌డంతో ఈ విశ్లేష‌ణ జ‌రుగుతోంది. నిరసనల సందర్భంగా అరెస్టయి ప్రస్తుతం జైల్లో ఉన్న విశ్రాంత ఐపీఎస్‌ అధికారి దారాపురి కుటుంబ సభ్యులను ప‌రామ‌ర్శించే స‌మ‌యంలో....గొంతు పట్టుకుని కిందకు తోశారని ఆమె ఆరోపించారు.
సీఏఏ వ్యతిరేక నిరసనల సందర్భంగా అరెస్టయి ప్రస్తుతం జైల్లో ఉన్న విశ్రాంత ఐపీఎస్‌ అధికారి దారాపురి కుటుంబ సభ్యులను సాయంత్రం భారీ హైడ్రామా నడుమ ఆమె పరామర్శించారు. దారాపురి నివాసానికి వెళ్తుండగా లక్నోలోని లోహియా క్రాస్‌ వద్ద ప్రియాంక వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె వాహనం దిగి పార్టీ కార్యకర్తకు చెందిన ద్విచక్రవాహనంపై బయల్దేరారు. ఆ తర్వాత కూడా పోలీసులు అడ్డుకోవడంతో కాలినడకన వెళ్లేందుకు యత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు తనతో అనుచితంగా వ్యవహరించారని ప్రియాంక ఆరోపించారు. దారాపురి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆమె విలేకర్లతో మాట్లాడుతూ.. తనపై జరిగిన దాడిని వరించారు. ‘దారాపురి నివాసానికి వెళ్తుండగా, అకస్మాత్తుగా పోలీస్‌ వాహనం మాకు అడ్డువచ్చింది. మేం వెళ్లడానికి వీల్లేదని పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకని ప్రశ్నించగా.. ముందుకువెళ్లడానికి అనుమతించబోమని బదులిచ్చారు. నేను వాహనం దిగి నడవడం మొదలుపెట్టా. పోలీసులు నన్ను చుట్టుముట్టారు. ఒక మహిళా పోలీసు నా గొంతు పట్టుకుంది.మరో పోలీసు నన్ను కిందకు నెట్టివేసింది. ఇంకో పోలీసు నా మెడ పట్టుకుని పైకి లేపింది. అయితే నేను నిశ్చియించుకున్నా. పోలీసు అణచివేతకు గురైన ప్రతి పౌరుడి తరఫున నిలబడాలని. ఇది నా సత్యాగ్రహం’ అని ప్రియాంక పేర్కొన్నారు.
ఈ సంద‌ర్భంగా పోలీసుల చ‌ర్య‌ల‌ను, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తీరును త‌ప్పుప‌ట్టారు. పోలీసుల‌ చర్యతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిందని ఆమె మండిపడ్డారు. ‘వారు ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. మమ్మల్ని ఎందుకు అడ్డుకున్నారో దేవుడికే తెలియాలి. ఇది ఎస్పీజీతో సమస్య కాదు. యూపీ పోలీసులతో సమస్య. మమ్మల్ని అడ్డుకోవడానికి కారణమేంటి? ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం పిరికితనంతో వ్యవహరిస్తున్నది. నేను కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిని. రాష్ట్రంలో నేను ఎక్కడికి వెళ్లాలో ప్రభుత్వం నిర్ణయించలేదు. నేను శాంతియుతంగా వెళ్తున్నాను. నా పర్యటన గురించి ఎవరికీ చెప్పలేదు. ముగ్గురి కంటే మించి నా వెంట లేరు. నన్ను అడ్డుకునే హక్కు వారికి లేదు’ అని ధ్వజమెత్తారు. మరోవైపు, ప్రియాంక ఆరోపణలు అవాస్తవమంటూ లక్నో సీఐ అర్చనా సింగ్‌ తోసిపుచ్చారు.