సూర్య‌... గురించి ర‌జ‌నీకాంత్ పేల్చిన బాంబు

September 23, 2020

ఒక‌వైపు క‌మ‌ర్షియల్ సినిమాల్ని ఇర‌గ‌దీసే త‌మిళ హీరోలు.. మ‌రోవైపు ప్ర‌యోగాత్మ‌క చిత్రాల్ని చేయ‌టానికి ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. త‌మ‌కున్న ఇమేజ్ ను వ‌దిలేసి మ‌రీ.. న‌ట‌న‌కు అవ‌కాశం ఉన్న సినిమాలు చేసే తీరు టాలీవుడ్ అగ్ర న‌టుల‌తో పోలిస్తే.. కోలీవుడ్ అగ్ర న‌టుల‌కే ఎక్కువ‌. ఆరు పాట‌లు.. ఆరు ఫైట్లు.. హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ లో పాట లాంటి కాన్సెప్టుల‌కు దూరంగా సినిమాలు చేసే అగ్ర హీరోలు కోలీవుడ్ లో క‌నిపిస్తారు. అదే ప‌ని టాలీవుడ్ లో చేయాలంటే కిందా మీదా ప‌డుతుంటారు.
ఇదంతా ఎందుకంటే.. తాను చేసే ప్ర‌తి సినిమాకు అంతో ఇంతో వేరియేష‌న్స్ చూపించేందుకు త‌పించే న‌టుల్లో సూర్య ఒక‌రు. అత‌డు తాజాగా చేసిన చిత్రం కాప్పాన్. తెలుగులో బందోబ‌స్త్ గా విడుద‌ల కానుంది.స‌యేషా హీరోయిన్ గా చేసిన ఈ సినిమా ఆగ‌స్టు 30న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో మ‌రో ప్ర‌త్యేక‌త ఏమంటే మోహ‌న్ లాల్.. ఆర్య లాంటి ప్ర‌ముఖ న‌టులు కూడా చేయ‌టం.
ఈ సినిమా రిలీజ్ డేట్ విష‌యంలో ఒక ప్ర‌త్యేక‌త ఉంది. అది చిత్ర హీరో సూర్య పుట్టిన రోజు. ఆ సంద‌ర్భంగా సినిమాను విడుద‌ల చేస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఫంక్ష‌న్ తాజాగా చెన్నైలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ లాంటి ప్ర‌ముఖులు ఎంద‌రో హాజ‌ర‌య్యారు.
ఈ సంద‌ర్భంగా మాట్లాడిన ర‌జ‌నీకాంత్ సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. సూర్య న‌టించిన తొలి చిత్రం చూసిన‌ప్పుడు అత‌నికి న‌టించ‌టం రాదేమో అనుకున్నాన‌ని.. కానీ త‌న‌ను తాను మ‌లుచుకొని ఇప్పుడున్న స్థాయిలో నిల‌బ‌డ్డాడ‌ని ప్ర‌శంసించాడు. ఇలా ఒక ప్ర‌ముఖ న‌టుడి గురించి త‌న మ‌న‌సులోని మాట‌ను ఇంత ఓపెన్ గా చెప్పేయ‌టం ర‌జ‌నీ గొప్ప‌త‌నం అనుకుంటే.. అలాంటి వాతావ‌ర‌ణం కోలీవుడ్ కు సొంత‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.