కేంద్రం చేతులెత్తేసినా జగన్ పదేపదే 'ప్రత్యేక' మంత్రం.. ఎందుకు?

September 21, 2020

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిసి, వివిధ అంశాలపై దాదాపు గంటన్నర పాటు చర్చించారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులపై వినతి పత్రం అందించారు. పోలవరం సహా వివిధ ప్రాజెక్టులకు రావాల్సిన పెండింగ్ నిధులు విడుదల చేయాలని కోరారు. తెలుగు సంవత్సరాది ఉగాది రోజున 25 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. అదే సమయంలో ప్రత్యేక హోదా కోసం మరోసారి విజ్ఞప్తి చేశారు.

దక్షిణాది రాష్ట్రాలతో పోటీ పడాలంటే ఏపీకి విభజన సమయంలో ఇచ్చిన హోదా హామీని నెరవేర్చాలని, హోదా ఇచ్చేందుకు ఆర్థిక సంఘం సిఫార్సులు అవసరం లేదని 15వ ఆర్థిక సంఘం చెప్పిందని గుర్తు చేశారు. ఈ అంశం కేంద్రం పరిధిలోనిదని, ఈ హామీని నెరవేర్చాలని కోరారు. ఇటీవల వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. ఏపీకి హోదా రావాలని, కానీ ఇది కేంద్రం పరిధిలో ఉందని వ్యాఖ్యానించారు.

తమకు 20 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా తీసుకు వస్తామని జగన్ ఎన్నికలకు ముందు పదేపదే చెప్పారు. కానీ ఇప్పుడు కేంద్రానికి పూర్తి మెజార్టీ ఉందని, ఏం చేయలేమని వైసీపీ చెబుతోంది. హోదాపై వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే సభలో గట్టిగా ఎందుకు నిలదీయడం లేదని, సభలో నిరసనలు చేసే అవకాశముందని, కానీ వైసీపీ అలా చేయడం లేదని విపక్షాలు గుర్తు చేస్తున్నాయి.

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ చెప్పగా, హోదా కంటే మెరుగైన ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పిందని జనసేనాని అన్నారు. టీడీపీ హోదా అంశాన్ని పెద్దగా లేవనెత్తడం లేదు. కానీ ఎవరైతే కేంద్రం మెడలు ఐతే వంచుతామని చెప్పారో అదే వైసీపీ ఇప్పుడు సభలో కేంద్రాన్ని నిలదీయకుండా బయట మాత్రం పదేపదే హోదా అంశాన్ని ఎందుకు లేవనెత్తుతోందనే ప్రశ్న తలెత్తుతోంది.

హోదా అంశంపై అధికారంలో ఉన్న వైసీపీయే పదేపదే గుర్తు చేస్తుండటం వెనుక మతలబు... ఈ అంశాన్ని సజీవంగా ఉంచేందుకే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. పీపీఏల సమీక్ష మొదలు రాజధాని మార్పు వరకు వివిధ అంశాలపై జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం నెలకొందని విపక్షాలు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు చర్యలకే పాల్పడుతోందని ప్రజలు భావిస్తున్నారని టీడీపీ నిందిస్తోంది.

ఇలాంటి పరిస్థితుల్లో ముందు ముందు హోదా అంశం ద్వారానే ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. అందుకే దీనిని వైసీపీ సజీవంగా ఉంచే ప్రయత్నాలు చేస్తోందని చెబుతున్నారు. హోదాను దాదాపు ప్రతి పార్టీ మరిచిపోయి... హోదాను మించి సహకారం అందిస్తామని కేంద్రం చెబుతున్నప్పటికీ వైసీపీ ఎంపీల నుండి జగన్ వరకు అదే అంశాన్ని ప్రస్తావిస్తుండటం వెనుక లోగుట్టు ఉండి ఉంటుందని చెబుతున్నారు. హోదాపై చిత్తశుద్ధి ఉంటే సభలో, బయటా గట్టిగా పట్టుబడాల్సి ఉందని, కానీ అలా మాత్రం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.