పొలిటిక‌ల్ పెద్ద‌పులి... మ‌ళ్లీ ఎందుకు ఎంట్రీ?

September 22, 2020

మాట‌లు త‌క్కువ‌!

చేత‌లు ఎక్కువ‌!!

సోనియాగాంధీ గురించి ఇంత‌కంటే సింపుల్‌గా చెప్ప‌లేం. అయినా ఇపుడు ఎందుకు సోనియాగాంధీ ప‌రిచ‌యం అనుకుంటున్నారా? తాజాగా దేశ రాజ‌కీయాల్లో ఒక ప్ర‌త్యేక సంద‌ర్భం ఇది. బీజేపీ వ్య‌తిరేక కూట‌మి ఏర్ప‌డ‌క ముందు వ‌ర‌కు సోనియాగాంధీ దాదాపు పార్టీ దైనందిన కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉండిపోయారు. రాహుల్‌గాంధీయే యాక్టివ్‌గా న‌డిపిస్తున్నారు. ఇక ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల నుంచి సోనియాగాంధీ దాదాపు త‌ప్పుకున్నారు. కానీ స‌డెన్‌గా ఆమె మ‌ళ్లీ ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్న‌ట్టు ప్ర‌క‌ట‌న వ‌చ్చేసింది. మ‌రి ఎందుకు సోనియా త‌న నిర్ణ‌యం వెన‌క్కు తీసుకున్నారు? 

ఇది ఒక పెద్ద ప్ర‌శ్న‌!!

ఇటీవ‌లి ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే... రాహుల్ చాలావ‌ర‌కు పుంజుకున్న మాట నిజ‌మే. అయితే, ఈసారి కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ వ‌చ్చే అవ‌కాశం లేదు. మ‌రోవైపు త‌న వ్యూహాత్మ‌క చ‌ర్య‌లు నిర్ణ‌యాల‌తో జ‌నాల్లో ఎమోష‌న్ పండించి మ‌ళ్లీ మోడీ మాయ చేసే ప‌రిస్థితులు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో రాజ‌కీయాల‌కు దూరంగా ఉండ‌టం వ‌ల్ల కాంగ్రెస్ పార్టీకే కాదు, అస‌లు రాహుల్ కెరియ‌రే ప్ర‌మాదంలో ప‌డే ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. 

అందుకే అనారోగ్యం పీడిస్తున్నా ఆమె బ‌రిలో దిగ‌క త‌ప్ప‌లేదు. ఉత్తరప్రదేశ్ లోని రాయబరేలిలో ఆమె తిరిగి పోటీ చేయ‌బోతున్నారు. ఇది కాంగ్రెస్ శ్రేణుల‌కు ఆనంద‌క‌ర‌మే కానీ... ఇంత అవ‌స‌రం ఇపుడు ఎందుకు అన్న‌దానికి క‌చ్చిత‌మైన సమాధానాలున్నాయి.  రాబోయేది సంకీర్ణ ప్ర‌భుత్వం అనేది ఆల్మోస్ట్ డిసైడ్ అయిపోయింది. యువకుడు అయిన‌ రాహుల్ నాయకత్వంపై మిత్రుల్లో త‌గినంత భ‌రోసా ఇంకా క‌ల‌గ‌లేదు. ప్రస్తుతం ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నా కూడా రాహుల్ గాంధీని సీనియర్ కాంగ్రెస్ నేతలు కొంద‌రు మ‌నస్ఫూర్తిగా స్వీక‌రించ‌డం లేదు. ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌తో క‌లిసినా, క‌ల‌వ‌క‌పోయినా ఎన్నికల తర్వాత అవన్నీ కాంగ్రెస్తో జ‌త‌క‌ట్ట‌డం ఖాయ‌మే. అయితే, ఎప్ప‌టినుంచో కేంద్ర రాజ‌కీయాల్లో వేలు పెడుతున్న‌ సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీల అధినేతలు రాహుల్  నాయ‌క‌త్వం కింద ప‌నిచేయ‌డానికి పెద్ద గా ఆస‌క్తిని క‌న‌బ‌ర‌చ‌డం లేదు.  ఈ కీల‌క స‌మ‌యంలో సోనియాగాంధీ లేక‌పోతే చేతికి అందే అవ‌కాశం చేజారిపోయేలా భావించిన సోనియాగాంధీ బ‌రిలో దిగిపోయారు. గ‌ట్టు నుంచి రాజ‌కీయం చేయ‌డం వేరు... ప్ర‌త్య‌క్షంగా రాజ‌కీయం చేయ‌డం వేరు. ప‌రిస్థితులు అనుకూలిస్తే ఆమెనో, లేక మ‌న్మోహ‌నో మ‌ళ్లీ ప్ర‌ధాని అభ్య‌ర్థిగా తెర‌పైకి వ‌చ్చినా ఆశ్చ‌ర్యం లేదు. అందుకే ఒంట్లో ఓపిక త‌గ్గినా ఆమె రిస్కు చేస్తున్నారు.