ఐఆర్ఎస్ అధికారి సస్పెండ్ వెనుక అసలు కథ ఇదేనట

September 22, 2020

లెక్కలు తేలాల్సిందే అన్నట్లుగా వ్యవహరించటం ఏపీ ప్రభుత్వానికి కొత్తేం కాదంటున్నారు. అధికారం చేతిలోకి వచ్చిన మొదట్లోనే అక్రమ నిర్మాణమంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఉపయోగించిన ప్రజావేదికను యుద్ధ ప్రాతిపదికన కూల్చేయించిన జగన్ ప్రభుత్వం.. తర్వాత ఆయన అద్దెకు నివాసంగా ఉన్న ఇంటిని టార్గెట్ చేయటం తెలిసిందే. కరకట్ట మీద ఉన్న అక్రమ కట్టడాల్ని కూల్చే వరకూ తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదంటూ భారీ ప్రకటనలు చేయటాన్ని మర్చిపోలేం. తర్వాత తెర వెనుక చోటు చేసుకున్న పరిణామాలతో ఏపీ సర్కార్ కామ్ గా ఉందన్న మాట వినిపిస్తూ ఉంటుంది.
లెక్కలు తేల్చే వరకూ ఒప్పుకోని మనస్తత్వంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను అభివర్ణిస్తారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు. వారి ఆరోపణలకు తగ్గట్లే చోటు చేసుకున్న పరిణామాలకు తగ్గట్లే తాజా ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు. ఏపీ క్యాడర్ లో పని చేస్తున్న ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిషోర్‌ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కేంద్ర సర్వీసులో ఉన్న అధికారిని రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసే వీలు లేదన్న విషయాన్ని పక్కన పెట్టి మరీ వేటు వేయటం ఇప్పుడు కలకలం రేపుతోంది.
 పరిశ్రమలు.. మౌలిక సదుపాయాలు.. వాణిజ్యశాఖ నుంచి అందిన నివేదిక ఆధారంగానే ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లుగా చెబుతున్నా.. అసలు కారణం వేరే ఉందన్న మాట వినిపిస్తోంది. సదరు అధికారి పదేళ్ల క్రితం అంటే 2009లో జగన్ కు చెందిన జగతి పబ్లికేసన్స్ ను ఆడిట్ చేయటాన్ని మర్చిపోకూడదు. అప్పట్లో ఇన్ కం ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ గా వ్యవహరించేవారు.
రూ.10 షేరును రూ.350కు కొనుగోలు చేసినట్లు జగతి పబ్లికేషన్స్ చూపించింది. నష్టాల్లో ఉన్న కంపెనీ షేరుకు అంత ధర పెట్టి ఎందుకు కొంటారంటూ ఇదే అధికారిక ఆరా తీశారు మైనస్ రూ.19 ఉన్న షేర్ ను రూ.350 చొప్పున ఎలా కొనుగోలు చేస్తారన్న కీలకపాయింట్ బయటకు తీసింది ఎవరో కాదు.. ఈ కృష్ణకిషోరేనని చెబుతారు. అంతేకాదు.. రూ.350 కోట్లకు పన్ను కట్టాలని అప్పట్లో ఆయన నోటీసు జారీ చేశారంటారు. మరిన్ని చేసిన అధికారిని చూస్తూ ఊరుకోరుగా? అంటూ నాటి సంగతుల్ని ప్రస్తావిస్తున్నారు పలువురు సీనియర్ అధికారులు. లెక్కలు తేల్చే విషయంలో ఏపీ సీఎం ఎంత కచ్ఛితంగా ఉంటారన్నది తాజా ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పక తప్పదు.