లెస్బియ‌న్ పాత్ర చేసింద‌ని ఇంట్లో వాళ్లు ఏడ్చార‌ట‌

September 21, 2020

హీరోయిన్లు ఎంత మోడ‌ర్న్‌గా ఉన్న‌ప్ప‌టికీ వాళ్ల కుటుంబ స‌భ్యులు కూడా అలాగే ఉంటార‌ని అనుకోలేం. తెర‌పై కొన్ని అభ్యంత‌ర‌క‌ర పాత్ర‌లు చేసిన‌పుడు వాళ్ల‌కు ఇబ్బందిగానే ఉంటుంది. హీరోయిన్లు వివాదాస్ప‌ద పాత్ర‌లు చేసినా, మ‌రీ ఎక్కువ శృంగారం ఒల‌క‌బోసినా చూడ‌టానికి వాళ్ల‌కు ఇబ్బందిగానే ఉంటుంది. తెలుగు, త‌మిళ సినిమాల్లో మెరిసిన రెజీనా క‌సాండ్రాకు కూడా ఈ ఇబ్బంది త‌ప్ప‌లేద‌ట‌. ఆమె హిందీలో ఈ మ‌ధ్యే సోనమ్‌ కపూర్‌తో కలిసి ‘ఏక్‌ లడకీకో ఐసాలహా’ అనే సినిమా చేసింది. అందులో వీళ్లిద్ద‌రివీ లెస్బియ‌న్ పాత్ర‌లు కావ‌డం గ‌మ‌నార్హం. రెజీనా ఇంత బోల్డ్ క్యారెక్ట‌ర్ చేస్తుంద‌ని సౌత్ జ‌నాలు ఊహించి ఉండ‌రు. కానీ ఈ క్యారెక్ట‌ర్ చేసి ఆమె షాకిచ్చింది.
దీన్ని అంద‌రూ జీర్ణించుకోలేక‌పోయారు. రెజీనా కుటుంబ స‌భ్యులు, స్నేహితులు కూడా ఈ పాత్ర‌తో ఇబ్బంది ప‌డ్డార‌ట‌. వాళ్లు ఈ సినిమా చూసి ఏడ్చార‌ని రెజీనా త‌న కొత్త సినిమా *ఎవ‌రు* ప్ర‌మోష‌న్ల‌లో వెల్ల‌డించింది. ఇది సమాజంలోని ఓ సమస్య గురించి చర్చించిన సినిమా అని.. త‌న‌కు తెలిసిన చాలా మంది స్నేహితుల్లో కాల్‌ చేసి మెచ్చుకున్న వారూ ఉన్నార‌ని ఆమె తెలిపింది. ఇక తాను న‌టించిన అ! సినిమాకు మేక‌ప్ విభాగంలో జాతీయ అవార్డు రావ‌డంపై రెజీనా స్పందిస్తూ.. నాని ఫోన్ చేసి ఈ విష‌యం చెబుతూ నీ వ‌ల్లే ఈ అవార్డు వ‌చ్చింద‌ని అన్నట్లు వెల్ల‌డించింది. మేక‌ప్ కోసం దాదాపు 24 గంట‌లు ప‌ట్టిన రోజులు కూడా ఉన్నాయ‌ని.. ఒళ్లంగా టాటూలు వేయించుకున్నాక తాను నాలుగు రోజుల పాటు స్నాన‌మే చేయ‌లేద‌ని.. స్పాంజ్ బాత్‌కే ప‌రిమితం అయ్యాన‌ని.. ఆ క‌ష్టానికి జాతీయ అవార్డు రూపంలో ఫ‌లితం ద‌క్కింద‌ని రెజీనా చెప్పింది.