జగన్ మనసు బాధ పడిందేమో... హైకోర్టును రద్దు చేస్తారేమో!

September 21, 2020

ప్రజలు కోరలేదు. ప్రతిపక్షాలు కోరలేదు. తన మానిఫెస్టోలో పెట్టలేదు. పైగా తాను ఎన్నికల ముంద మార్చను అని చెప్పిన రాజధాని మాట తప్పి మడమ తిప్పి మార్చాలని డిసైడ్ చేశారు. అసెంబ్లీలో బిల్లు పెట్టారు. తస్సదియ్యా... శాసన మండలి గురించి మరిచిపోయారు. అక్కడ తగిలిన షాక్ కు జగన్ హర్ట్ అయ్యారు. అంతే నేరుగా అసెంబ్లీలో మీరు బిల్లు ఆపితే... నా మనసు చాలా బాధపడింది... అంటూ అచ్చం ఒక నియంతలా మాట్లాడారు. అంతేనా... ఈరోజు తన మనసుకు నచ్చని పని చేసిన శాసన మండలిని జగన్ రెడ్డి రద్దు చేసేస్తూ తీర్మానించారు. కేంద్రానికి పంపించి బిల్లును బీజేపీ కోర్టులో నెట్టారు. 

కట్ చేస్తే... సాయంత్రానికి జగన్ ఆనందాన్ని హైకోర్టు ఆవిరి చేసింది. జగన్ ప్రభుత్వ నిర్ణయం శుద్ధ తప్పు, పంచాయతీ ఆఫీసులకు మీ పార్టీ రంగులు వేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ కోర్టు చీవాట్లు పెట్టింది. శాసన మండలి రద్దు చేసిన కొన్ని గంటల్లోనే జగన్ కు కొత్త బాధ వచ్చిపడింది. శాసనమండలి లాగే హైకోర్టు కూడా జగన్ మనసును బాధపెట్టింది. కొంపదీసి శాసన మండలి లాగే దీనిని కూడా రద్దు చేయాలని జగన్ కు ఆలోచన వస్తే... అయ్యో అది సాధ్యం అయ్యే పని కాదే. 

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జగన్ కూల్చేయడం, రద్దు చేయడంలో మితిమీరిన ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా... 8 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వ భవనాన్ని కూల్చేశారు. జాతీయ జెండా, గాంధీ, చెట్టు, పుట్ట శ్మశానం వదలకుండా వైసీపీ రంగులు వేశారు. వేలాది మంది రైతులు, కోట్లాది ప్రజల మనసు తెలుసుకోకుండా వారు ఇచ్చిన అధికారంతో అడ్డదిడ్డమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజధాని వంటి పెద్ద నిర్ణయం ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా తీసుకుంటున్నారు. దీంతో ఏడు నెలలకే జగన్ పాలనతో జనం హాహా కారాలు చేసే పరిస్థితి వచ్చింది. ప్రజలు ఎంత బాధపడినా పర్లేదు... జగన్ మనసు బాధపడితే రద్దయిపోతాయంతే. 

కొసమెరుపు ఏంటంటే... రంగులేయడంపై కోర్టు చీవాట్లు పెట్టి వదిలేయలేదు. పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున రంగులు తొలగించాలని ఆదేశించింది. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం బాధ్యత తీసుకోవాలని పేర్కొంది. అంటే...ముఖ్యమంత్రి ఆలోచన వల్ల 1300 కోట్లు రంగులు వేయడానికి, మరో 1300 కోట్లు రంగులు తుడపడానికి ఖర్చవుతాయన్నమాట.