ప్ర‌గ‌తి ర‌థ చ‌క్రం...ప‌నిచేయ‌ని కేసీఆర్ అస్త్రం

September 25, 2020

గులాబీ ద‌ళ‌ప‌తి ఉగ్ర‌రూపం ఫ‌లితం ఇవ్వ‌లేదు. ప్ర‌గ‌తి ర‌థ‌చ‌క్రాల‌కు వేదిక అయిన సంస్థ‌లో త‌న ప్ర‌ణాళిక ప్ర‌కారమే అన్నీ జ‌ర‌గాల‌నే ఆకాంక్ష నెర‌వేర‌లేదు. సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులు తిరిగి ఉద్యోగాల్లో చేరేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన మూడు రోజుల గడువు మంగళవారం అర్ధరాత్రితో ముగిసింది. సమ్మెను వీడి బేషరతుగా ఉద్యోగాల్లో చేరాలని, లేదంటే..ఉద్యోగాలు పోయిన‌ట్లేన‌ని....ఆర్టీసీ రూట్ల‌ను ప్రైవేటు ప‌రం చేసేస్తాన‌ని చేసిన హెచ్చ‌రిక‌ల‌ను కార్మికులు లైట్ తీసుకున్నారు. మొత్తం దాదాపు 50,000 మంది ఉద్యోగుల్లో.... గడువు ముగిసే సమయానికి దాదాపు 300 మంది మాత్ర‌మే విధుల్లో చేరారు. వీరిలో ఎక్కువ మంది రిటైర్మెంట్‌కు ద‌గ్గ‌ర ఉన్న‌వారు, ఆర్టీసీ ప్ర‌ధాన కార్యాల‌యమైన బ‌స్‌భ‌వ‌న్లో ప‌నిచేసేవారే.

కేసీఆర్ హెచ్చ‌రిక ఫ‌లించి ఉద్యోగులు విధుల్లో చేరేందుకు వస్తుండటంతో పోలీసులు డిపోల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయమైన బస్‌భవన్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల వద్ద భద్రత ఏర్పాటు చేశారు. బస్‌భవన్‌లో మొత్తం 350 మంది వరకు అధికారులు, సిబ్బంది ఉండగా.. బేషరతుగా ఉద్యోగాల్లో చేరేందుకు 80మందికిపైగా ముందుకొచ్చారు. వీరు కాకుండా, దాదాపు 200-200 మంది మాత్ర‌మే రాష్ట్రవ్యాప్తంగా విధుల్లో చేరారు.

మ‌రోవైపు, ఆర్టీసీ కార్మికులు స‌మ్మె కొన‌సాగించ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వం నుంచి హామీ వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టంచేశారు. ఇప్పటికైనా చర్చలతో పరిష్కారించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.

కాగా తాము ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు ఆర్టీసీ తెలిపింది. 4,547 ఆర్టీసీ, 1,937 అద్దెబస్సులు కలుపుకొని మొత్తం 6,484 బస్సులు ప్రయాణికులకు సేవలందించాయి. 4,547 మంది తాత్కాలిక డ్రైవర్లు, 6,484 మంది తాత్కాలిక కండక్టర్లు విధులు నిర్వర్తించారని, టిమ్స్ ద్వారా 5,660 టికెట్లు జారీచేసినట్టు అధికారులు పేర్కొన్నారు.