బస్టాండ్ లో ఫిదా పోరి.. ఎవరూ గర్తుపట్టలేదు

September 21, 2020

మిగిలిన హీరోయిన్లకు కాస్త భిన్నం సాయిపల్లవి. స్కిన్ షో చేస్తూ..గ్లామర్ పండిస్తే కానీ పేరు ప్రఖ్యాతులు.. టాప్ స్టార్ అన్న పేరు రాదన్న మాటను చెరిపేసిన టాలెంట్ ఆమె సొంతం. హీరోయిన్ అనే పదానికి సరికొత్త అర్థాన్నిచ్చేలా ఉంటాయి ఆమె విషయాలు. తాజాగా ఆమె చేసిన పని సంచలనంగా మారటమే కాదు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఫిదా మూవీలో ఆమె చేసిన పాత్రతో తెలంగాణ ప్రాంతవాసులు సాయిపల్లవికి ఎంతలా కనెక్ట్ అయిపోయారో చెప్పాల్సిన అవసరమే లేదు. తెలంగాణలోని చాలా ఇళ్లల్లో సాయిపల్లవిని తమ అమ్మాయిగా భావిస్తూ.. మురిసిపోతుంటారు. అలాంటి ఫిదా పోరి.. ఏకంగా పరకాల బస్టాప్ లో ఒంటరిగా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? చుట్టూ చేసి.. అభిమానం పొంగించి.. ఊపిరి ఆడకుండా చేయరు? అన్న డౌట్ రావొచ్చు.
కానీ.. అందుకు భిన్నంగా తనను ఎవరూ గుర్తుపట్టకుండా షాకిచ్చింది సాయి పల్లవి. పరకాల బస్టాండ్ లో ఉన్న కుర్చీలో ఒంటరిగా కూర్చున్న ఆమెను ఎవరూ గుర్తు పట్టలేదు. బస్టాండ్ మొత్తం బిజీబిజీగా ఉన్నప్పటికీ ఎవరూ ఆమెను గుర్తుపట్టలేదు. లంగా జాకెట్.. మొత్తాన్ని కవర్ చేసేలా పొడుగాటి చొక్కాను కవర్ చేసింది. చూసేందుకు సగటు మధ్యతరగతి అమ్మాయిని మరపించేలా పెద్ద బ్యాగ్ పట్టుకున్న ఆమె.. కాసేపు కూర్చొని.. నెమ్మదిగా వెళ్లిపోయింది.
ఇంతకీ పరకాల బస్టాండ్ కి సాయి పల్లవి ఎందుకు వెళ్లిందంటే.. రీల్ సీన్ కోసం రియలిస్టిక్ గా చేయటం ప్రత్యేకతగా చెప్పాలి. రానా - సాయి పల్లవి జంటగా నటిస్తున్న విరాట్ పర్వం షూటింగ్ ప్రస్తుతం పరకాలలో జరుగుతోంది. అక్కడ బస్టాండ్ లో సీన్ కోసం రియల్ గా చేశారు. బస్టాండ్ లోని ఒక హోటల్లో రహస్యంగా కెమేరాను పెట్టేసి.. ఎవరికి సినిమా షూటింగ్ అన్న భావన రాకుండా చేసి.. సాయి పల్లవితో నటింపచేశారు.
ఆసక్తికరంగా బస్టాండ్ లో అంత మంది ఉన్నా.. ఎవరూ కూడా ఆమెను గుర్తించకపోవటం విశేషం. దీనికి సంబంధించిన ఒక చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంతైనా ఫిదా పోరి తీరే వేరయా.

ఇదిగో వీడియో లింకు - Link: https://twitter.com/i/status/1170306796885438464