చిరు కోసం స్టోరీ రెడీ చేసి షాకిచ్చిన కొత్త దర్శకుడు

September 23, 2020

మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయడం కలగా పెట్టుకుని దర్శకత్వ శాఖలోకి అడుగుపెట్టే కుర్రాళ్లకు లెక్కే ఉండదు. తమకంటూ ఒక గుర్తింపు సంపాదించాక కూడా దీన్ని ఒక పెద్ద స్వప్నం లాగే భావించి ఆ దిశగా అడుగులు వేస్తుంటారు. కానీ ఆ అవకాశం అందరికీ దక్కదు. ఇప్పుడు మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే హాట్ షాట్ డైరెక్టర్లలో ఒకడిగా మారిన సందీప్ రెడ్డి వంగ సైతం ఇలా కలలు కన్నవాడేనట. మెగాస్టార్‌తో సినిమ ా చేయడం తన జీవిత ఆశయం అంటూ ఇటీవలే అతను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే ఊరికే మాటలు చెప్పడం కాదు.. చిరును మెప్పించే దిశగా అతను ఇప్పటికే పని కూడా పూర్తి చేశాడట. చిరు కోసం తన దగ్గర కథ సిద్ధంగా ఉందని సందీప్ ప్రకటించడం విశేషం.

తన చిన్నతనం నుంచి మెగాస్టార్‌కు వీరాభిమానిని అని.. ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని.. ఆయనతో సినిమా చేయడం తన కల అని సందీప్ చెప్పాడు. ప్రస్తుతం చిరు కోసం తన దగ్గర కథ సిద్ధంగా ఉందని.. అది ఆయన వయసుకు, స్టార్ డమ్‌కు తగ్గ కథే అని సందీప్ తెలిపాడు. చిరు తనతో సినిమా చేస్తాడో లేదో తర్వాత సంగతి అని.. కానీ ఆయనకు తన దగ్గరున్న కథను కచ్చితంగా చెబుతానని సందీప్ తేల్చి చెప్పాడు. ‘అర్జున్ రెడ్డి’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్‌తో పని చేయడానికి చాలామంది స్టార్లు సిద్ధంగా ఉన్నారు. మహేష్ బాబు ఒక దశలో సందీప్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా వార్తలొచ్చాయి. కానీ ఈ లోపు ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ కోసం సందీప్ బాలీవుడ్‌కు వెళ్లిపోయాాడు. ఇప్పుడు తన మూడో సినిమాను కూడా అక్కడే చేస్తున్నాడు. తర్వాత విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ తర్వాత మెగాస్టార్‌తో సినిమా కోసం ప్రయత్నిస్తాడేమో సందీప్.