తెలంగాణ యువరాజుకు కష్టమొచ్చింది

September 23, 2020

ఇంట గెలిచి రచ్చ గెలవమన్నది సామెత. తాజాగా వెలువడుతున్న పుర ఎన్నికల ఫలితాలు చూస్తే.. ఆసక్తికరంగా మారాయి. అంచనాలకు ఏ మాత్రం తేడా లేకుండా టీఆర్ఎస్ దూసుకెళుతోంది. దీని క్రెడిట్ మొత్తం తెలంగాణ యువరాజు కేటీఆర్ ఖాతాలో వేసేందుకు గులాబీ దళం సిద్ధమవుతోంది. ఇదంతా ఓకే అయితే.. అసలు ఇబ్బంది అంతా ఇంట్లోనే.
అదేనండి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల మున్సిపాలిటీలోనే. ఎందుకంటే ఇక్కడ స్వతంత్య్రులు ఎక్కువగా గెలవటం గులాబీ నేతలకు ఒక పట్టాన మింగుడు పడటం లేదు. సిరిసిల్ల మున్సిపాలిటీలో మొత్తం 39 వార్డులకు ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ 24 స్థానాల్లో విజయం సాధించింది. అంటే.. మున్సిపాలిటీ మీద గులాబీ జెండా రెపరెపలాడే పరిస్థితి. ఇదంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. ఫలితాల లోతుల్లోకి వెళితే.. అసలు ఇబ్బంది అంతా కనిపిస్తుంది.
మొత్తం 39 స్థానాల్లో 24 వార్డుల్లో టీఆర్ఎస్ గెలవగా మిగిలిన 15 వార్డుల్లో పది వార్డులు ఇండిపెండెంట్ సభ్యులు విజయం సాధించారు. మూడు వార్డుల్లో బీజేపీ.. రెండు వార్డుల్లో కాంగ్రెస్ గెలిచింది. లోకమంతా వీరుడని పొగిడేస్తున్న వేళ.. తన సొంత నియోజకవర్గంలో పార్టీకి చెందిన నేతలు కాకుండా స్వతంత్య్రులు ఇంత భారీగా గెలవటం ఏల? అన్నది ప్రశ్న. ఇంట్లో ఈగల మోత.. ఊళ్లో పల్లకి మోత అన్నట్లుగా.. సొంత నియోజకవర్గం మీద గులాబీ యువరాజు మరింత పట్టు సాధించాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.