రంగంలోకి సెలెక్ట్ కమిటీలు... షరీఫ్ దెబ్బకు వైసీపీ విలవిల

September 24, 2020

నిజమే... ఏపీ శాసనమండలి చైర్మన్ మహ్మద్ షరీఫ్ తీసుకున్న సంచలన నిర్ణయంతో అధికార వైసీపీ... తనకు ఇష్టం లేకున్నా కూడా చేతులు కట్టుకుని తాను తీసుకున్న కీలక నిర్ణయాలపై వేసిన కమిటీలకు సారథ్య బాధ్యతలు వహించక తప్పని పరిస్థితి నెలకొందని చెప్పక తప్పదు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిని పీక పిసికేసేలా మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న జగన్ సర్కారు అసెంబ్లీలో తీర్మానించిన వికేంద్రీకరణ బిల్లుతో పాటు సీఆర్డీఏ బిల్లును సెలెెక్ట్ కమిటీకి పంపుతూ షరీఫ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మండలిలో అంతగా బలం లేని వైసీపీ నానా యాగీ చేసినా కూడా షరీఫ్ తొణకలేదు. అయితే రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన సెలెక్ట్ కమిటీలకు తాము సహకరించేది లేదని వైసీపీ తెగేసి చెప్పింది. 

అంతేకాకుండా అసెంబ్లీలో ఫుల్ మెజారిటీ కలిగిన తాము తీసుకున్న నిర్ణయాలకు అడ్డుపుల్లలు వేస్తుందా? అంటూ ఏకంగా శాసనమండలినే రద్దు చేస్తూ జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే అసెంబ్లీ తీర్మానంతో మాత్రమే మండలి రద్దు కాదు కదా. పార్లమెంటు ఆమోదిస్తేనే మండలి రద్దు సాధ్యపడుతుంది. అందుకు చాలా సమయమే పడుతుంది. ఈ క్రమంలో తాను అనుకున్నట్లుగా సెలెక్ట్ కమిటీలపై ముందుకు సాగిన షరీఫ్... కమిటీల ఏర్పాటుకు గడువు ముగుస్తున్న చివరి నిమిషంలో రెండు సెలెక్ట్ కమిటీలను ఏర్పాటు చేస్తూ బుధవారం రాత్రి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా రెండు కమిటీలకుె నేతృత్వం వహించే బాధ్యతలను వైసీపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలకు అప్పజెప్పేశారు.

సీఆర్డీఏ రద్దు బిల్లుపై ఏర్పాటైన సెలెక్ట్ కమిటీకి మంత్రి బొత్స సత్యనారాయణ చైర్మన్ గా, టీడీపీ సభ్యులు దీపక్ రెడ్డి, బచ్చుల అర్జునుడు, బీద రవిచంద్ర, గౌనివారి శ్రీనివాసులు, వైసీపీ సభ్యులు మహ్మద్ ఇక్బాల్, పీడీఎఫ్ సభ్యుడు వెంకటేశ్వరరావు, బీజేపీ సభ్యుడు సోము వీర్రాజులను షరీఫ్ సభ్యులుగా నియమించారు. ఇక వికేంద్రీకరణ బిల్లుపై ఏర్పాటు చేసిన సెలెక్ట్ కమిటీకి మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి చైర్మన్ గా, టీడీపీకి చెందిన నారా లోకేశ్, అశోక్ బాబు, తిప్పేస్వామి, సంధ్యారాణి, పీడీఎఫ్ సభ్యుడు లక్ష్మణరావు, బీజేపీకి చెందిన మాధవ్ లను షరీఫ్ సభ్యులుగా నియమించారు. షరీఫ్ తీసుకున్న ఈ కీలక నిర్ణయంతో ఇష్టం లేకున్నా కూడా బొత్స, బుగ్గనలు రెండు కమిటీలకు చైర్మన్లుగా వ్యవహరించక తప్పని పరిస్థితి నెలకొందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.