ఎన్నికోట్లు ఇచ్చినా ఆ యాడ్ చేయదట

September 23, 2020

కోట్ల కోసం కక్కుర్తి పడి అడ్డమైన యాడ్స్ లో నటించే నటులు చాలామందే ఉన్నారు. కోట్లు ఇస్తామని ఆఫర్ ఇస్తే.. వెనుకా ముందు చూసుకోకుండా అడ్డమైన చెత్తను చెప్పేసేందుకు రెఢీ అవుతారు. ఇందుకు భిన్నంగా పొడుగుకాళ్ల బ్యూటీ.. నాటి హాట్ నటి శిల్పాశెట్టి మాత్రం నో అంటే నో అని చెప్పేసిందట.
దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధతో చెక్కినట్లుగా ఉండే ఈ బ్యూటీ ఇప్పటికే చిక్కుకున్న వివాదాల గురించి తెలిసిందే. ఉన్న వాటితో సరిపోవట్లేదు.. కొత్తవి ఎందుకని అనుకున్నారో.. లేక కొత్తగా వచ్చిన యాడ్స్ కు సంబందించిన రూల్స్ మీద ఉన్న అవగాహనో కానీ.. ఆమె రూ.10 కోట్ల యాడ్ ఆఫర్ ను వదిలేసిన తీరు మాత్రం చర్చనీయాంశంగా మారింది.
ఫిట్ నెస్ కు చెందిన ఒక ప్రముఖ ఆయుర్వేద సంస్థ శిల్పను సంప్రదించిందట. ఒక పిల్ (మాత్ర) వేసుకుంటే నాజూగ్గా.. సన్నగా అయిపోతారని చెప్పటమే సదరు యాడ్ సారాంశమట. జస్ట్.. తమ పిల్ ఒకటి వేసుకున్నట్లు చూపిస్తే చాలని.. శిల్పంలాంటి శిల్ప బాడీ షేప్ ను తమ ఉత్పత్తికి ప్రచారంగా వాడేసుకుంటామని చెప్పిందట. ఇందుకు ఏకంగా రూ.10 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తామని కూడా ఆశ చూపిందట. సదరు పిల్ వేసుకుంటే ఇట్టే శిల్పా శెట్టి మాదిరి సన్నబడిపోతారన్న ప్రచారం చేయటమే సదరు కంపెనీ ఆలోచనగా చెబుతున్నారు.
అయితే.. ఈ భారీ ఆఫర్ కు శిల్పా నో చెప్పిందట. తాను చేయని.. తాను అనుసరించని పద్దతుల్ని ఇతరులకు చెప్పటానికి.. రికమెండ్ చేయటానికి తాను సిద్ధంగా లేనని తేల్చేసిందట. రూ.10 కోట్లు ఇస్తానన్నా తాను ఆఫర్ ను అంగీకరించలేనని చెప్పేసింది. అంతేకాదు.. సరైన పద్దతుల్లో ఆహారం తీసుకుంటే ఫిట్ నెస్ అదే వస్తుందని.. సహజంగానే బరువు తగ్గాలని.. అప్పుడే ఆరోగ్యంగా ఉంటుందని సలహా ఇస్తోంది. భారీ ఆఫర్ ను కాదని చెప్పటం గ్రేటే.