తమ్మినేని సార్... స్పీకర్ సీట్టో కూర్చుని ఆ మాటలేంటండీ

September 22, 2020

ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా వైసీపీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం వ్యవహారాన్ని చూస్తుంటే చాలా సందేహాలే వస్తున్నాయని చెప్పాలి. టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తమ్మినేని... ఇప్పటిదాకా ఏకంగా ఆరు పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అంతేకాకుండా టీడీపీ నుంచి ప్రజారాజ్యంలోకి మారిపోయిన తమ్మినేని... ఆ తర్వాత కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ నేతగా మారిపోయారు. సత్తా కలిగిన పొలిటీషియన్ గా తనను తాను ఎలివేట్ చేసుకున్న తమ్మినేని.,.. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న సమయంలోనే మంత్రి పదవిని కూడా దక్కించుకున్నారు. తాజాగా మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు కాగా... సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తమ్మినేనికి స్పీకర్ బాధ్యతలు అప్పగించారు.

స్పీకర్ అంటే,... ఏ పార్టీకి మొగ్గు చూపకుండా అన్ని పార్టీలను సమదృష్టితో చూడాల్సి ఉంది. సాధారణంగా అందరు స్పీకర్లు అధికార పార్టీ నుంచే ఎంపిక అవుతున్నా... స్పీకర్ సీట్లోకి రాగానే తన పార్టీతో పాటు మిగిలిన విపక్షాలను కూడా సమదృష్టితోనూ చూస్తూ సాగుతున్న నేతలనే ఇప్పటిదాకా చూశాం. అయితే తమ్మినేని మాత్రం అందుకు మినహాయింపు అని చెప్పక తప్పదన్న వాదనలు ఇటీవలి కాలంలో క్రమంగా పెరిగిపోతున్నాయి. తాజాగా తమ్మినేని నోట ఒకింత అసహనం కలిగించే వ్యాఖ్యలు కూడా వింటున్నాం. ఈ తరహా వ్యాఖ్యలు చేసే తమ్మినేని... అసలు స్పీకర్ పదవికి అర్హుడేనా? అన్న దిశగానూ ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.

మొన్నటికి మొన్న సీఎం జగన్ మోహన్ రెడ్డిని మహానుభావుడిగా అభివర్ణించిన తమ్మినేని... మొన్నామధ్య ఏకంగా ఓ బూతుపదాన్ని కూడా వాడారు. ఈ రెండు వ్యాఖ్యలు కూడా స్పీకర్ చైర్ లో కూర్చున్న సందర్భంగానే తమ్మినేని నోట నుంచి వచ్చాయి. అంతేనా.. సభలోని మహిళా సభ్యులను  ఉద్దేశించి ‘ఆంటీస్’ అంటూ కూడా తమ్మినేని వ్యాఖ్యానించారు. స్పీకర్ సీట్లో కూర్చున్న వ్యక్తి నుంచి ఈ తరహా వ్యాఖ్యలను అసలు ఊహించలేం. స్పీకర్ సీట్లో కూర్చుని మరీ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తే... ఆ నేత ఆ పదికి సరితూగడని కూడా చెప్పేయొచ్చు. మరి స్పీకర్ కుర్చీలో కూర్చుని తన నోటికి పని చెబుతూ... ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తున్న తమ్మినేనిని స్పీకర్ గా జగన్ ఎలా కొనసాగిస్తున్నారో అర్థం కాని ప్రశ్నే.