జ‌గ‌న్‌ను సుజ‌నా భ‌లే ఇరికించాడుగా

September 21, 2020

మూడు రాజధానుల ఏర్పాటుపై మొండిప‌ట్టుతో ముందుకు సాగుతున్న ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఈ క్ర‌మంలో ఏ అభ్యంత‌రాల‌ను ప‌ట్టించుకోని సంగ‌తి తెలిసిందే. ఆయా అంశాల‌ను ప్ర‌స్త‌వించిన వారిని సైతం రాజ‌కీయ విమ‌ర్శ‌కులుగా జ‌గ‌న్ ఆండ్ టీం కొట్టిపారేస్తోంది. అయితే, తాజాగా ఏపీ సీఎం జ‌గ‌న్‌కు ఊహించ‌ని ట్విస్ట్ ఎదురైంది. .కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎంపీ సుజనాచౌదరి ఏపీ సీఎం జగన్‌కు ఆయన 10 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. అమరావతి మార్పు అంశంపై రైతుల ఆందోళనల నేపథ్యంలో రాజధాని మార్చవద్దని సీఎంకు సుజనా సూచించారు.
రాజధానిగా అమరావతి ఎంపిక, భూ సమీకరణ, రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాలు, అక్కడ జరిగిన అభివృద్ధి, పూర్తిచేసిన నిర్మాణాలు, పనుల పురోగతి తదితర అంశాలతో పాటు రాజధాని మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలు, దానివల్ల కలిగే నష్టాలను ఈ లేఖ‌లో సుజ‌నా చౌద‌రి పేర్కొన్నారు. ఇప్పటికిప్పుడు రాజధాని మార్చటం అంటే న్యాయపరమైన చిక్కులు, ఆర్థికపరమైన అవస్థల్ని కొనితెచ్చుకోవడమేనని సుజనా హెచ్చరించారు. గత ప్రభుత్వంతో రైతులు, పెట్టుబడిదార్లు ఒప్పందం కుదుర్చుకున్నందున వాటిని నెరవేర్చకపోతే వారు కోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్నారు. అందుకే ప్రజా ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని సుజనాచౌదరి సూచించారు.
నిధులు లేవనే సాకు చూపి రాజధాని మార్చటమనేది సరైన నిర్ణయం కాదని సుజ‌న లేఖ‌లో పేర్కొన్నారు.  ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే రూ.3వేల కోట్లతో పెండింగ్‌ పనులు పూర్తిచేస్తే అమరావతి నుంచే పాలన సాగించేందుకు అవసరమైన అన్ని హంగులు సమకూరతాయని పేర్కొన్నారు. అదే స‌మ‌యంలో రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రకటనను అమలు చేయాలంటే ప్రభుత్వానికి రూ.4లక్షల కోట్లు అవసరమని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.