ఆహుతుల‌ను మైమ‌రిపించిన టాంటెక్స్, వేగేశ్న ఫౌండేషన్ సంగీత గాన విభావరి

September 25, 2020

ఉదాత్త‌మైన ఉద్దేశంతో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి విశేష స్పంద‌న ద‌క్కింది. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) మరియు వేగేశ్న ఫౌండేషన్‌ అక్టోబరు 11న కూచిపూడి ఇండియ‌న్ కిచెన్ రెస్టారెంట్ ఫంక్ష‌న్ హాల్‌లో దివ్యాంగుల సహాయార్ధమై ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన “సంగీత గాన విభావరి”  అనే కార్యక్రమం అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఘనంగా నిర్వహించబడింది. సంస్థ‌ 2019 అధ్యక్షులు శ్రీ చినసత్యం వీర్నపు ఆహుతుల‌కు స్వాగతం పలికి, టాంటెక్స్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించి సభకు టాంటెక్స్ కార్యవర్గ సభ్యులను పరిచయం చేసి, వారి సహాయ సహకారాలతోనే ఇటువంటి మంచి కార్యక్రమాలను మీ ముందుకు తీసుకురాగలుగుతుతున్నామ‌ని చెప్పారు. తదుపరి వేగేశ్న ఫౌండేషన్ వారు భార‌త‌దేశంలో దివ్యాంగుల కోసం చేస్తున్న సేవలను అందరికి తెలియజేసి, తరువాత వేగేశ్న ఫౌండేషన్ ఫౌండ‌ర్ మ‌రియు లైఫ్ టైం మేనేజింగ్ ట్ర‌స్టీ డా. వంశీ రామరాజును, అమెరికా గాన కోకిల శ్రీమతి. శారద ఆకునూరి, అపర ఘంటసాల బాల కామేశ్వరరావును సభకు పరిచయం చేసి కార్యక్రమం ప్రారంభించారు.
ఈ సంద‌ర్భంగా డా. వంశీ రామరాజు మాట్లాడుతూ ముందుగా నటసామ్రాట్ డా. అక్కినేని నాగేశ్వరరావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, వారి సేవలను కొనియాడారు. వేగేశ్న ఫౌండేషన్ మీ ఎన్నారైల ప్రాజెక్ట్‌ అని తెలిపారు. 30 సంవత్సరాల క్రితం ప్రాంభించిన ఈ ప్రాజెక్టుకు డా. అక్కినేని నాగేశ్వరరావు ఎంతో మ‌ద్ద‌తు ఇచ్చార‌ని గుర్తు చేశారు. 12వ ఘంటసాల మరియు 9వ యస్.పి. బాలు సంగీతోత్సవాలు పేరిట , అమెరికాలో వివిధ నగరాలలో సెప్టెంబ‌ర్ 21 నుంచి న‌వంబ‌రు 10 వరకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అని తెలియజేశారు. శ్రీమతి. శారద ఆకునూరి, అపర ఘంటసాల బాల కామేశ్వరరావు చేస్తున్న సహాయానికి ధన్యవాదాలు  తెలియజేశారు. కార్యక్రమానికి విచ్చేసిన అందరిని తాను చేపట్టిన ఈ ప్రాజెక్ట్ కోసం సహయపడవలసిందిగా కోరారు.
గాయకులు శారద మరియు బాల కామేశ్వరరావు మంచి మంచి పాటలతో అందరిని అలరించారు. వారు ఆలపించిన పాట‌లలో కొన్ని "రాముని అవతారం రవికుల సోముని అవతారం... "చిటపట చినుకులు పడుతూ వుంటే..", "ఎవరవయా, ఎవరవయా...", "వినిపించని రాగలే,కనిపించని అందాలే...", "చూడుమా చందమామ.." వంటి పాటలతో అందరిని ఆనంద డొలికల్లో ముంచెత్తారు. లోకల్ గాయకులు చంద్రహాస్ మద్దుకూరి " కన్నులలో పలకరించు వలపులు...", డ్యుయెట్ అందరిని అలరించింది. నాగి వడ్లమన్నాటి  మరియు శారద "మంచు కురిసే వేళలో ...", "లేత చలిగాలిలో హయ్ ..." పాటలు శ్రోతలలో మరింత ఉత్తేజాన్ని నింపాయి.
ముఖ్య అతిథి డా. వంశీ రామరాజును, అమెరికా గాన కోకిల శ్రీమతి. శారద ఆకునూరి, అపర ఘంటసాల బాల కామేశ్వరరావు టాంటెక్స్ అధ్యక్షులు వీర్నపు చినసత్యం, కార్యదర్శి ఉమామహెష్ పార్నపల్లి, సతీష్ బండారు, ఉపాధ్యక్షులు పాలేటి లక్ష్మి శాలువా, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు. టాంటెక్స్ అధ్యక్షులు శ్రీ వీర్నపు చినసత్యం మాట్లాడుతూ డా. వంశీ రామరాజు చేస్తున్న సేవలను కొనియాడి, టాంటెక్స్ను వారు దివ్యాగుల కోసం చేస్తున్న స్వచ్చంద సేవలో భాగస్వాములను చేయడం  చాలా ఆనందంగా వుందని, ఇటువంటి మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన మరియు విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రసార మాధ్యమాలైన టీవీ9, టివి5 , మన టివి, టి.ఎన్.ఐ, ఫన్ ఏషియా, దేసిప్లాజ , తెలుగు టైమ్స్, ఐఏసియా లకు, Kuchipudi Indian kitchen Restaurant owner Sunitha Reddy వారికి  అభివందనములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ పూర్వాధ్యక్షులు డా. ఉరిమిండి నరసిం హా రెడ్డి, సి.ఆర్. రావు, చంద్రహాస్ మద్దుకూరి, అనంత్ మల్లవరపు, లెనిన్ వేముల, శరత్ యర్రం, కృష్ణా రెడ్డి కోడూరు, లోకెష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఎంతో కృషి, సమయం వెచ్చించిన టాంటెక్స్ కార్యవర్గ సభ్యులకు మరియు వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.  కార్యక్రమంలోని ఛాయాచిత్రాలను ఈ లింక్‌లో చూడవ‌చ్చు.