సంచలన నిర్ణయం తీసుకున్న కేసీఆర్

September 21, 2020

సమాజ ధోరణులు అవగాహన చేసుకోవడంలో కేసీఆర్ ముందుంటారు. కొన్ని నిర్ణయాలు ట్రెండుకు అనుగుణంగా తీసుకుంటుంటారు కేసీఆర్. తాజాగా మాజీ డీజీపీ హెచ్‌జె దొర ఆటోబయోగ్రఫీ ’’జర్నీ థ్రూ టర్బులెంట్‌ టైమ్స్‌’’ పుస్తక ఆవిష్కరణలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ సమాజంలో పతనం అవుతున్న నైతిక విలువల గురించి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఒక సంచలన నిర్ణయం కూడా ప్రకటించారు. 

సమాజంలో నేర ప్రవృత్తి బాగా పెరిగిపోతోంది. పెంపకం వల్ల కొంత, విద్యా విధానంలో లోపాల వల్ల కొంత ఇలా జరుగుతోంది. అందుకే  నైతిక విలువలు పెంపొందించేలా విద్యా విధానం ఉండాలని ఆలోచించామన్నారు. కొన్నిసార్లు, కొందరు మనషులు మృగాల్లా ప్రవర్తిస్తుంటే విస్మయం, బాధ కలుగుతోందని అన్నారను. ఈ నేరప్రవృత్తి ప్రబలకుండా చూడాల్సిన అవసరం మన విద్యావ్యవస్థపై ఉందని సీఎం అన్నారు. అందుకే వచ్చే ఏడాది నుంచి విలువలు పెంపొందించే పాఠ్యాంశాలను బడుల్లో బోధించాలని భావిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇది సాదాసీదాగా చేసే పని కాదని... నైతిక విలువలు పెంపొందించేలా పాఠ్యాంశాల తయారీ కోసం ఒక అధ్యయనం తప్పనిసరి అన్నారు.  

నైతిక విలువలతో కూడిన పాఠ్యాంశాలపై అధ్యయనం కోసం మాజీ డీజీపీలతో కమిటీ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇందుకోసం జీయర్‌స్వామి లాంటి ఆధ్యాత్మిక, ధార్మికవేత్తల సలహాలు కూడా తీసుకుంటామన్నారు. తెలంగాణను ఆదర్శవంతమైన సమాజంగా తీర్చిదిద్దడానికి పోలీసులు కూడా తమ విలువైన భాగస్వామ్యం అందించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

ప్రజాస్వామ్యం అయినంత మాత్రాన కఠినంగా ఉండకూడదని ఏం లేదన్నారు. మంచిని కాపాడటం కోసం కొన్నిసార్లు కఠినంగా వ్యవహరించడం తప్పు కాదు అని కేసీఆర్ అన్నారు. కొన్ని పనులు ఇష్టం లేకున్నా చేయాల్సి వస్తుందన్నారు. సమాజానికి మంచి జరుగుతుందని అనుకుంటే కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదన్నారు కేసీఆర్. పోలీసుల బాధ్యత శాంతి భద్రతల పర్యవేక్షణకే పరిమితం కాదని, సామాజిక బాధ్యత కూడా అన్నారు. గుడుంబా నిర్మూలన, పేకాట క్లబ్బుల మూసివేత, బియ్యం అక్రమ రవాణా అరికట్టడం, హరిత హారం వంటి కార్యక్రమాల్లో పోలీసులు కూడా ఎంతో కృషి చేశారు అని కేసీఆర్ అన్నారు.