గులాబీ నేతలు సీపీఐ పార్టీ ఆఫీసుకు వెళ్లటమంటే?

September 24, 2020

రాజకీయాల్లో ఎవరూ శత్రువులు కాదు. అదే సమయంలో ఎవరూ మిత్రులు కాదు. శాశ్విత శత్రువులకు.. మిత్రులకు ఏ మాత్రం అవకాశం లేని వేదికగా చెప్పుకోవాలి. తనను కలిసేందుకు వచ్చిన కమ్యూనిస్ట్ అగ్రనేతలకు సీఎం హోదాలో ఉన్న కేసీఆర్ కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వకుండా గంటల తరబడి వెయిట్ చేయించి మరీ.. వెనక్కి పంపేసిన రోజులన్ని ఇప్పుడు గతమయ్యాయి. తన అవసరానికి ఎవరితోనైనా రాయబారాన్ని నెరపటంలో కేసీఆర్ అందె వేసిన చేయి.
ఉద్యమ సమయంలోనే తన చతురతను ప్రదర్శించిన ఆయన.. అవసరమైతే రెండు కాదు పది అడుగులు వెనక్కి వేసేందుకు ఏ మాత్రం వెనుకాడని కేసీఆర్.. సమయం వచ్చినప్పుడు అంతకంతా చూపించటం కొత్తేం కాదు. ఎన్ని అనుభవాలు ఎదురైనా..కేసీఆర్ నోరు తెరిచి అడిగితే.. ఏ రాజకీయ పార్టీ కూడా కాదనలేని రీతిలో పావులు కదపటం గులాబీ బాస్ ప్రత్యేకతగా చెప్పాలి.
తాజాగా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తాము ఒంటరిగా బరిలోకి దిగుతున్నట్లుగా గంభీరంగా ప్రకటించిన కేసీఆర్.. ఇప్పుడు సీపీఐ మద్దతు కోసం తమ పార్టీకి చెందిన కీలక నేతల్ని సీపీఐ కార్యాలయానికి పంపటం చూస్తే.. సందర్భానికి తగినట్లుగా వ్యవహరించటం.. అవసరమైన వేళల్లో అనవసరమైన పంతాలకు.. పట్టింపులకు పోవటం తనకేమాత్రం ఇష్టం ఉండదన్న విషయాన్నికేసీఆర్ స్పష్టం చేశారని చెప్పాలి.
కేసీఆర్ ఆదేశాలతోనే తాము సీపీఐ కార్యాలయానికి వచ్చినట్లుగా టీఆర్ఎస్ నేతలు కేకే అండ్ కో విలేకరులకు చెప్పారు. మరి.. ఉప ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లుగా కేసీఆర్ వ్యాఖ్యానించారు కదా? అన్న ప్రశ్నకు.. అప్పుడు అలా చెప్పాం.. ఇప్పుడు ఇలా చెబుతున్నామంటూ నవ్వుతు చెప్పిన మాటలు చాలు.. కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉంటాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
కేసీఆర్ లాంటి పవర్ ఫుల్ నేత తమ దగ్గరకు సాయం కోరి వచ్చిన వైనాన్ని సీపీఐ నేతలు స్వాగతించారు. కేసీఆర్ మీద తమకున్న గుర్రును తమ మాటల్లో కాస్త చూపించినా.. స్నేహహస్తం చాచిన మిత్రుడ్ని వదులుకోకూడదన్నట్లుగా కమ్యూనిస్టు నేతల మాటలు ఉన్నాయని చెప్పాలి. తాము ఎప్పుడూ కేసీఆర్ ను మొత్తానికే బాగా పని చేయటం లేదని ఎప్పుడూ అనలేదన్నారు. అంతేకాదు.. టీఆర్ఎస్ తో తమకున్న మిత్రత్వాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవటం గమనార్హం.
ఉద్యమ సమయంలోనూ.. తర్వాత జరిగిన ఉప ఎన్నికల వేళ.. టీఆర్ఎస్ కు మిత్రుడిగా నిలిచామని.. కేకేను రాజ్యసభ సభ్యుడిగా పంపే సందర్భంలోనూ తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కేకేకు అనుకూలంగా ఓట్లు వేసిన విషయాన్ని గుర్తుచేశారు. మొత్తానికి టీఆర్ఎస్ తో చేతలు కలపటం అనైతికం ఎంతమాత్రం కాదన్న విషయాన్ని స్పష్టం చేసేందుకు సీపీఐ నేతలు తెగ ప్రయత్నించారని చెప్పాలి. మొత్తంగా చూస్తే.. సీపీఐను సాయం కోరటం ద్వారా.. హుజూర్ నగర్ ఉప ఎన్నికకు తానెంత ప్రాధాన్యతను ఇస్తున్నాన్న విషయాన్ని కేసీఆర్ చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్నిచూస్తే.. .హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు దేనికైనా రెఢీ అన్నట్లుగా కేసీఆర్ ఉన్నారన్న విషయం అర్థం కాక మానదు.