కేసీఆర్ కి కేంద్రం మాస్టర్ స్ట్రోక్ !

September 24, 2020

అనువుగాని చోట మాత్రమే కాదు... అనువుగాని సమయంలో కూడా అధికులమనరాదు. ఆర్టీసీ యూనియన్లు నెలరోజుల సమ్మె చేసినా వారిపై జనానికి కోపం రాకపోవడానికి కేసీఆర్ ఇగోనే కారణం. రాష్ట్రంలో ప్రతిఒక్కరికీ ఆర్టీసీ విషయంలో కేసీఆర్ కావాలనే మొండిగా ఉన్నారన్న విషయం చాాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రే కావచ్చు. ఉద్యోగుల మాట నేను వినడం ఏంది అనుకోవచ్చు. తనదే నెగ్గాలనుకోవడం వేరు, నలుగురినీ కలుపుకుంటూ తాను నెగ్గుతూపోవడం వేరు. కేసీఆర్ తెలంగాణకు సుప్రీం. కాని ఆ పదవి ఇచ్చింది ప్రజలే. ప్రజాస్వామ్య వ్యవస్థలో పెత్తనం ఒకరి చేతిలో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ అది భ్రమే. మనిషి సక్రమంగా ఉన్నంత వరకు మాత్రమే ఆ పెత్తనం వారి చేతిలో ఉంటుంది. అలా కాకుండా ఇష్టానుసారం పవర్ నాదే కదా అని ముందుకు పోతూ ఉంటే... మెల్లగా ఆ పవర్ తగ్గుతూ పోతుంది. ఒకనాటికి అది దూరమవుతుంది. చరిత్రలో ఎన్నోసార్లు ఇది ప్రూవ్ అయ్యింది. 

తెలంగాణ ఆర్టీసీ సంక్షోభం విషయంలో కేసీఆర్ తనదే పైచేయి సాధించాలనుకునే క్రమంలో ప్రతిసారీ ఓడిపోతున్నారు.  అదిలించాడు. బెదిరించాడు. పీకేస్తాను అన్నాడు. కానీ... వీటన్నింటికి మించిన మాస్టర్ స్ట్రోక్ తో నేడు విలవిల్లాడు. ఇది కేసీఆర్ ఏ కోశానా ఊహించలేదు. ఆర్టీసీ విషయంలో హైకోర్టులో జరుగుతున్న వాదనల్లో ఈరోజు కేంద్రం పాల్గొనింది.

ఈ సందర్భంగా కేంద్రం వినిపించిన వాదనలతో కేసీఆర్ ప్రభుత్వానికి దిమ్మ తిరిగి బొమ్మకనపడింది. అసలు మీరు దేనికోసమైతే పోరాడుతున్నారో, దేనిని అయితే కేసీఆర్ రద్దు చేస్తున్నారో దాని ఉనికే అసలు లేదని కేంద్రం పేర్కొంది. అంటే టీఎస్ ఆర్టీసీ అనేదే లేదని, ఆ సంస్థకు చట్టం అనుమతే లేదని, ఇప్పటికీ రెండు రాష్ట్రాల్లో కొనసాగుతున్నది ఏపీఎస్ ఆర్టీసీ మాత్రమే అని, అందులో కేంద్రానిది 33 శాతం వాటా అని,  ఇంక ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని హైకోర్టులో కేంద్రం సంచలన వాదన వినిపించింది.

ఇదిలా ఉండగా... ఏపీఎస్‌ ఆర్టీసీలో కేంద్రానికి 33 శాతం వాటా ఆటోమేటిగ్గా  టీఎస్‌ ఆర్టీసీకి బదిలీ కాబోదని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు చెప్పడం విశేషం. ఈ వాదనలను కేంద్రం తరపున లాయర్‌ రాజేశ్వర్‌రావు కోర్టుకు వివరించారు. టీఎస్‌ ఆర్టీసీ అసలు ఏ విధమైన చట్టబద్ధత లేని సంస్థ అని పేర్కొన్నారు. ఏపీఎస్‌ ఆర్టీసీని విభజిస్తే తప్పనిసరిగా కేంద్రం అనుమతి తీసుకోవాలని, కేంద్రం అలాంటి అనుమతి ఇవ్వనేలేదన్నారు. ఈ వాదనతో కేసీఆర్ సర్కారుకు కోర్టు వేసిన ప్రశ్నలకు మైండ్ బ్లాంక్ అయ్యింది.

ఆర్టీసీ.. ఏపీఎస్‌ ఆర్టీసీగా.. టీఎస్‌ ఆర్టీసీగా విభజన జరిగిందా? 

టీఎస్‌ ఆర్టీసీ కొత్తగా ఏర్పాటైందా? 

ఆర్టీసీ అంటే టీఎస్‌ ఆర్టీసీయేనా? లేక ఏపీఎస్‌ ఆర్టీసీనా? 

ఇవి కోర్టు వేసిన ప్రశ్నలు. దీనికి తెలంగాణ సీఎస్‌ ఎస్కే జోషి బదులిస్తూ... విభజన చట్టంలో షెడ్యూల్‌ 9 కిందకు ఆర్టీసీ వస్తుందన్నారు. పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 3 ప్రకారం టీఎస్‌ ఆర్టీసీ ఏర్పాటైందని ఏజీతో పాటు ఆర్టీసీ ఇంచార్జ్‌ ఎండీ తెలిపారు. ఆర్టీసీ విభజన అంశం కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉందని అడ్వకేట్‌ జనరల్‌ చెప్పారు. దీంతో న్యాయమూర్తి జోక్యం చేసుకుని ఒకవైపు విభజన పెండింగ్‌లో ఉందని చెబుతున్నారు. మరోవైపు కొత్త ఆర్టీసీని ఏర్పాటు చేశామంటున్నారు... ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. ఏపీఎస్‌ ఆర్టీసీ విభజన కోసం రెండు రాష్ట్రాలూ కేంద్రాన్ని అనుమతి కోరాలి కాదా అని నిలదీసింది ధర్మాసనం.  కేంద్రం అనుమతి లేకుండా రెండు కొత్త సంస్థలు ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించింది. ఆర్టీసీ విభజనకు కేంద్రం ఆమోదం తెలిపినట్లు ఆధారాల్లేవని కోర్టు  స్పష్టం చేసింది. దీంతో ఏం చెప్పాలో తెలియక ఫ్లేటు ఫిరాయించారు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు. ఏపీఎస్‌ ఆర్‌టీసీ ఆస్తులు, అప్పుల విభజన ప్రక్రియకు చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రజలకు అసౌకర్యం కలుగకుండా టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటు చేశామని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు హైకోర్టుకు తెలిపారు. ఇదెలా సాధ్యం. ప్రజల పేరు చెప్పి కేంద్రం అనుమతి లేకుండా... పెండింగ్‌లో ఉన్న దానిపై స్వతంత్రంగా ఎలా వ్యవహరిస్తారు? అని కోర్టు ప్రశ్నించింది. ఆర్టీసీ విభజన జరగకుండా ప్రభుత్వం ఎలా నోటిఫికేషన్‌  ఇస్తుందని నిలదీసింది.  సెక్షన్‌ 47Aపై సుదీర్ఘ విచారణ జరుపుతోంది. చివరకు కోర్టుకు విసుగు వచ్చి... ప్రభుత్వానికి సమస్యను పరిష్కరించే ఉద్దేశం ఉందా లేదా అని కూడా గట్టిగా ప్రశ్నించింది హైకోర్టు. మీరు సమయం వృథా చేస్తూ... ఉద్దేశపూర్వకంగా తప్పుడు నివేదికలు ఇస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని అధికారులను హెచ్చరించింది హైకోర్టు. ఆర్థిక శాఖ  రెండు నివేదికలు ఇస్తే... అవి పరస్పర విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది. ఐఏఎస్ అధికారులు అసమగ్ర నివేదికలివ్వడంపై కోర్టు విస్మయం వ్యక్తంచేసింది. కనీసం మొన్న మీరు ఇచ్చిన నివేదికనే మీరు చదవలేదని పేర్కొంది. దీంతో మళ్లీ ఫ్లేటు ఫిరాయించారు తెలంగాణ అధికారులు. టైం తక్కువగా ఉండటం వల్ల రికార్డుల ఆధారంగా నివేదిక రూపొందించామని, మన్నించాలని హైకోర్టును వేడుకున్నారు. 

సంచలనం ఏంటంటే....  మంత్రిని ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించినట్లు ఆర్టీసీ ఎండీ నివేదికలో స్వయంగా అంగీకరించడం అన్నారు. సీఎం, మంత్రులను కూడా తప్పుదోవ పట్టించేలా నివేదికలున్నాయని ఇంతకంటే ఘోరం ఇంకేమైనా ఉంటుందా అని మండిపడింది. రవాణ శాఖ మంత్రిని, ప్రభుత్వాన్నీ, సీఎంనే తప్పుదో పట్టించినవారు నిజాలు చెబుతున్నారని ఎలా నమ్మాలంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.

కొసమెరుపు - ఈరోజు కోర్టులో జరిగిన వాదనలతో ప్రభుత్వం అడ్డంగా బుక్కైనట్లు అర్థమైపోతుంది. కార్మికుల పట్ల కోర్టు జనం జాలి  చూపే అవకాశం ఉంది గాని కేసీఆర్ సర్కారు మాత్రం గట్టిగా మూల్యం చెల్లించుకోకతప్పే పరిస్థితి మాత్రం లేదు.