సెటైర్ అదిరింది: జగన్ మేనమామ కాదు శకుని మామ

September 21, 2020

ఏపీలో కాంగ్రెస్ ఉనికిలో లేకుండాపోయినా... పార్టీ అధ్యక్ష బాధ్యతలు కష్టకాలంలో మోసిన రఘువీరా రెడ్డి కూడా కాడి పక్కన పడేసినా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత తులసిరెడ్డి మాత్రం తనదైన శైలి వ్యాఖ్యలతో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన సీఎం జగన్మోహనరెడ్డిపై భారీ సెటైర్ వేశారు. అమ్మఒడి పథకం ప్రారంభం సందర్భంగా తాను రాష్ట్రంలో చిన్నారులందరికీ మేనమామనని ప్రకటించుకున్న జగన్‌పై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
పిల్లలకు మేనమామ కాకపోయినా ఫర్వాలేదు కానీ శకునిమామ మాత్రం కావొద్దని తులసిరెడ్డి హితవు పలికారు. మాతృభాషను హత్య చేసిన ఈ హంతక ప్రభుత్వానికి అమ్మ అని పలికే అర్హత లేదని ఆయన విరుచుకుపడ్డారు. ఇది 'అమ్మ ఒడి' కాదని, 'మమ్మీ ఒడి' అని ఎద్దేవా చేశారు.
జగన్ కు ఆంగ్లంపై అంత మోజుంటే తన పేపర్ ను ఆంగ్లంలోనే ప్రచురించాలని సవాల్ విసిరారు. అన్ని సంక్షేమ పథకాల నిధులను 'అమ్మ ఒడి'కి మళ్లించారని తులసిరెడ్డి ఆరోపించారు.
కాగా జగన్ ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలో సీబీఐ కోర్టుకు హాజరుకావడంపైనా ఆయనపై విమర్శల దాడి మొదలైంది. ప్రధాన విపక్షం టీడీపీ సహా మిగతా పార్టీల నేతలకు ఈ రోజు పెద్ద అస్త్రం దొరికినట్లయింది.