మోడీపై మెగా కోడలి బుంగమూతి

September 22, 2020

సంచలనానికి తెర తీశారు మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన. ప్రధాని మోడీ లాంటి నేత చేసిన పనిలో తప్పును వెతకటం ఒక ఎత్తు అయితే.. ఎంతో ధైర్యంగా తాను ఫీలైన విషయాన్ని ట్వీట్ తో చెప్పేసి హాట్ టాపిక్ గా మారారు. బుంగమూతి పెట్టుకొని ముద్దు ముద్దుగా గారం ఆడటం ఒక ఎత్తు.. సీరియస్ గా.. మీరిలా చేయటం బాగోలేదు.. మమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారన్న సీరియస్ రిమార్స్క్ తో పాటు.. సౌత్.. నార్త్ తేడాను ట్వీట్ తో తేల్చి చెప్పిన వైనం చూస్తే అవాక్కు అవ్వాల్సిందే.
నొప్పించనట్లుగా ఆచితూచి మాట్లాడే మామగారికి పూర్తి భిన్నంగా.. తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేసే చిరు కోడలు ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారిందని చెప్పాలి. జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ఆయన భావజాలాన్ని.. సిద్దాంతాల్ని సినిమాల రూపంలో చెప్పాల్సిన అవసరాన్ని తెలియజేసేందుకు బాలీవుడ్ ప్రముఖులతో ప్రధాని మోడీ ఒక భేటీని నిర్వహించటం తెలిసిందే.
ఈ భేటీకి అమీర్ ఖాన్.. షారుక్ ఖాన్ తో పాటు కంగనారౌనత్.. జాక్విలిన్ తో సహా పలువురు ప్రముఖ నటీనటులే కాదు.. దిగ్గజ దర్శకులు హాజరయ్యారు. ఈ భేటీపై తనకున్న అభ్యంతరాన్ని ట్వీట్ రూపంలో ప్రధానికి చెప్పేశారు ఉపాసన. ప్రియాతి ప్రియమైన మోడీ అంటూ మొదలెట్టినప్పటికీ.. దక్షిణ భారతావని సైతం ప్రధాని మోడీ అంటే పడి చస్తుందన్న మాటను చెప్పి.. తాము ఆయన్ను దేశ ప్రధానిగా ఎంత గర్వంగా ఫీల్ అవుతామో చెప్పింది.
అదే సమయంలో బాలీవుడ్ సినీ ప్రముఖులతో మాత్రమే మీరు భేటీ కావటం బాగోలేదు.. దక్షిణాది సినీ రంగం పట్ల నిర్లక్ష్యాన్ని చూపారు. చాలా బాధతో తానీ విషయాన్ని చెబుతున్నానని.. సరైన రీతిలో తన మాటల్ని ప్రదాని మోడీ తీసుకుంటారని తాను భావిస్తున్నట్లుగా పేర్కొంటూ ఉపాసన ట్వీట్ చేశారు. నార్త్ వారికి పెద్ద పీట వేశారు.. సౌత్ వారిని లైట్ తీసుకున్నారన్న విషయాన్ని కాస్త పొందిగ్గానే చెప్పినప్పటికీ.. మోడీ చేసిన పనిలో తప్పును తెలివిగా ఎత్తి చూపిన ఉపాసన ధైర్యాన్ని పలువురు మెచ్చుకుంటున్నారని చెప్పకతప్పదు.