పోలీసు కమిషనర్ ను బూతులు తిట్టిన ఉత్తమ్

September 23, 2020

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రథసారధి కమ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ కు కోపం వచ్చేసింది. సొంత పార్టీలో పట్టు లేని ఫస్ట్రేషన్ తో పాటు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీసుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులతో ఠారెత్తిపోయినట్లు కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు తాము చేసిన పనుల్ని మర్చిపోయిన ఉత్తమ్.. విపక్షంలో ఉన్న వేళ తనకెదురవుతున్న ఇబ్బందులకు ఇరిటేట్ అవుతున్నారు. ఎప్పుడూ లేని రీతిలో తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ మీద ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఎవరెన్ని చెప్పినా.. పోలీసుల వరకూ వచ్చేసరికి తమ అంతిమ బాసులైన అధికారపక్షానికి అంతో ఇంతో సానుకూలంగా ఉండటం ఎప్పుడూ ఉన్నదే. ఇవాళే కొత్తగా వచ్చిందేమీ కాదు. సుదీర్ఘకాలం పాటు పవర్ లో ఉన్న వేళ.. పోలీసుల్ని వాడేసిన వైనాన్ని మర్చిపోగలమా? ఆ మాటకు వస్తే.. దరిద్రపుగొట్టు కల్చర్లకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీనే అన్నది మర్చిపోకూడదు.
తమ హయాంలో సిస్టమ్ ను దెబ్బ తేసిన వారు ప్రస్తుతం అందుకు మూల్యం చెల్లిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. ఇక.. ఉత్తమ్ చేసిన వ్యాఖ్యల విషయానికి వస్తే.. తాము విపక్షంలో ఉన్న విషయాన్ని మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. పోలీసుల తీరును తప్పు పట్టటం..వారి వ్యవహారశైలిపై విమర్శలు గుప్పించటం మామూలే. కానీ.. ఒక ఉన్నతాధికారిని టార్గెట్ చేసినట్లుగా మండిపడటం సరికాదు. అది కూడా సదరు అధికారి వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా.. ఇమేజ్ డ్యామేజ్ చేసేలా వ్యాఖ్యలు చేయకూడదు.
ఒకవేళ చేయాలనుకుంటే.. అందుకు పక్కా సాక్ష్యాల్ని ప్రదర్శించి నాలుగు మాటలు అంటే.. దానికో అర్థం ఉంటుంది. కానీ.. అందుకు భిన్నంగా ఎలాంటి ఆధారాలు చూపించకుండా ఇష్టంవచ్చినట్లుగా ఆరోపణలు.. విమర్శలు చేయటం ద్వారా.. పోలీసులకు ఒళ్లు మండేలా చేస్తాయన్నది మర్చిపోకూడదు. తాజాగా ఉత్తమ్ చేసిన వ్యాఖ్యల్నే చూస్తే..  హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా అంజనీ కుమార్ ఐపీఎస్ గా విధులు నిర్వర్తించటానికి పనికిరాడని.. అవినీతిపరుడని.. వ్యక్తిత్వం లేదని.. దిగజారినోడంటూ ఉత్తమ్ మండిపడిన వైనం విస్మయానికి గురి చేస్తోంది.
తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా తాము ర్యాలీ నిర్వహిస్తామని కోరితే రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కొందరు తొత్తులు అవమానకరంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణను తీసుకొచ్చినందుకు ప్రజలు అధికారం ఇవ్వనప్పుడు.. ఆ విషయాన్ని కాంగ్రెస్ నేతలు గొప్పగా చెప్పుకోవటంలో అర్థముందా? అన్నది ప్రశ్న. అయినా.. మా తాతలు నేతలు తాగారన్న సామెతకు తగ్గట్లే ఉత్తమ్ మాటలు ఉన్నాయని చెప్పాలి.  
నిరసన ర్యాలీకి అనుమతులు ఇవ్వకపోతే ఆ విషయాన్ని హుందాగా చెప్పటం.. హైకోర్టుకు వెళ్లి అనుమతులు తెచ్చుకోవటం చేయాలే తప్పించి.. ఇలా ఇష్టం వచ్చినట్లుగా ఒక పోలీసులు ఉన్నతాధికారిని ఉద్దేశించి విమర్శలు.. ఆరోపణలు చేయటం ఎంతవరకు సబబు? అన్నది ప్రశ్న.
అంజనీ కుమార్ దిగజారిపోయారని.. తమను అవమానపర్చేలా మాట్లాడారని ఉత్తమ్ నిప్పులు చెరిగారు. సంఘ్ ర్యాలీకి రోడ్లు ఖాళీ చేసి అనుమతులు ఇస్తారా? దారుస్సలాంలో మజ్లిస్ సమావేశానికి ఇచ్చినట్లే గాంధీభవన్ లో చేసే దీక్షకు ఎందుకు అనుమతి ఇవ్వరు అని ప్రశ్నించారు. ఇలా ప్రశ్నించటం తప్పేం కాదు. కానీ.. ఆ ఊపులో అంజనీ కుమార్ ను ఉద్దేశించి వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యలు సరికావన్న మాట వినిపిస్తోంది.
అంజనీకుమార్.. నీ సంగతి చూస్తాం. ఎక్కడి నుంచో ఉద్యోగం చేసుకోవటానికి వచ్చావు. చేసుకొని పో. నీ వైఖరిపై మేం చాలా సీరియస్ గా ఉన్నాం. ఇలా ఓవరాక్షన్ చేసిన వారిని ఊరుకోం. అంతు చూస్తాం. ఐపీఎస్ బదులు నువ్వు కేపీఎస్ అని పెట్టుకో. ఇలాంటి చెంచాలు ఐపీఎస్ లుగా పనికి రారు. అంజనీ చిట్టా తీసి రాష్ట్ర గవర్నర్ ను కలుస్తాం. ఆయన్ను తొలగించాలని కంప్లైంట్ చేస్తామన్న ఉత్తమ్ మాటలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. ప్రభుత్వాన్ని.. ప్రభుత్వాన్ని నడిపే నేతల్ని.. అధికారపక్షాన్ని ఘాటుగా విమర్శించి.. హెచ్చరించాల్సింది పోయి.. ఒక పోలీసు ఉన్నతాధికారిపై ఇన్నేసి మాటలు అనటం సరికాదన్న మాట వినిపిస్తోంది.