రివ్యూ: గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ (వాల్మీకి)

September 23, 2020

టైటిల్‌: గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్
బ్యాన‌ర్‌: 14 రీల్స్ ఎంట‌ర్‌టైన‌ర్‌
న‌టీన‌టులు: వ‌రుణ్‌తేజ్‌, పూజా హెగ్డే, అథ‌ర్వ్‌
ఎడిటింగ్‌:  చోటా కె.ప్ర‌సాద్‌
సినిమాటోగ్ర‌ఫీ: అయ‌నాంక బోస్‌
మ్యూజిక్‌: మిక్కీ జే మేయ‌ర్‌
నిర్మాత‌లు: రామ్ ఆచంట‌, గోపీ ఆచంట‌
ద‌ర్శ‌కత్వం: హ‌రీష్ శంక‌ర్‌
సెన్సార్ రిపోర్ట్‌:  యు / ఏ
ర‌న్ టైం: 170 నిమిషాలు

టాలీవుడ్‌లో వైవిధ్య‌మైన క‌థ‌ల‌తో వ‌రుస‌గా సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు మెగా ఫ్యామిలీ వార‌సుడు మెగా ప్రిన్స్ వ‌రుణ్‌తేజ్‌. ఈ యేడాది సంక్రాంతికి ఎఫ్ 2 లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో త‌న మార్కెట్ రేంజ్ పెంచుకున్న వ‌రుణ్ తాజాగా వాల్మీకి సినిమాతో మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో వ‌రుణ్‌తేజ్ లుక్‌తోనే ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేశాడు. కోలీవుడ్‌లో సిద్ధార్థ్‌ జిగ‌ర్తాండ‌కు రిమేక్‌గా ఈ సినిమాను తెరెక్కించారు. అయితే.. ప‌లు కార‌ణాల వ‌ల్ల‌ విడుద‌ల‌కు ఒక‌రోజు ముందు ఈ సినిమా పేరును గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్‌గా మార్చారు. వ‌రుణ్ స‌ర‌స‌న పూజాహెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. కోలీవుడ్ హీరో అథ‌ర్వ కీల‌క‌పాత్ర‌లో న‌టించిన ఈ గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ ప్రేక్ష‌కుల‌ను ఎంత వ‌ర‌కు మెప్పించిందో స‌మీక్ష‌లో తెలుసుకుందాం.

క‌థ‌:
ఇండ‌స్ట్రీలో ద‌ర్శ‌కుడిగా రాణించాల‌ని క‌ల‌లు క‌నే అసిస్టెంట్ డైరెక్టర్ (అధర్వ మురళి) ఒక గ్యాంగ్ స్టర్ జీవితంపై సినిమా తీసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. ఈ క్ర‌మంలోనే త‌న సినిమాలో  గ్యాంగ్‌స్ట‌ర్ రోల్ కోసం స‌రైన వ్య‌క్తి కోసం వెతుకుతుండ‌గా అందుకు గద్దలకొండ గణేష్ (వరుణ్ తేజ్) స‌రైన వ్య‌క్తి అని భావిస్తాడు. ఈ గద్దలకొండ గణేష్ అనే వ్యక్తి ఎవరు ? అతను ఎందుకు అలా మారాడు ? అసలు వీరిద్దరూ సినిమా చేసారా లేదా ? ఈ కథకు పూజా హెగ్డే పాత్రకు ఉన్న సంబంధం ఏమిటి ? దర్శకుడు గ్యాంగ్‌స్టర్‌ను ఒప్పించటానికి ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డాడు ? అన్న అంశాల‌కు తెర‌మీదే ఆన్స‌ర్ దొరుకుతుంది.

క‌థ‌నం &  విశ్లేష‌ణ :
ఎక్కువుగా క్లాస్ సినిమాలు చేస్తూ వ‌స్తోన్న వ‌రుణ్ ఈ సినిమాతో మాంచి మాస్ లైన్ ఎంచుకున్నాడు. పక్కా మాస్ లుక్ లోకి మారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. తెర‌మీద వ‌రుణ్ లుక్‌ హైలైట్ గా నిలిచినా సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం అంత ఊహించిన విధంగా సాగలేదు. ఇక హ‌రీష్ శంక‌ర్ డైరెక్ష‌న్ మీద ముందు నుంచే చాలా మందికి కాస్త సందేహాలు ఉన్నాయి. సినిమా స్టార్ట్ అయ్యాక కొద్ది సేప‌టికే అవి నిజం చేసేశాడు హ‌రీష్. అయితే వ‌రుణ్‌తేజ్ క్యారెక్ట‌ర్‌ను డిజైన్ చేయ‌డం... వ‌రుణ్ డైలాగ్స్ విష‌యంలో మాత్రం ప్ర‌త్యేకంగా దృష్టి సారించారు. వ‌రుణ్ అగ్రెసివ్‌నెస్‌, లుక్స్ వేరియేష‌న్ అదిరిపోయాయి. క‌థనం మాత్రం ఆస‌క్తిగా ముందుకు సాగ‌దు. ఫస్ట్ హాఫ్ చాలా నీర‌సంగానే ముందుకు క‌దులుతూ ఉంటుంది. పూజా పాత్ర కూడా ఫస్ట్ హాఫ్ పూర్తయ్యే వరకు రివీల్ కాదు.

కీల‌క‌మైన సెకండాఫ్ విష‌యానికి వ‌స్తే ఫ‌స్టాఫ్‌తో పోలిస్తే కాస్త బెట‌ర్ అనిపిస్తుంది. క‌థ మార‌డంతో ప్రేక్ష‌కులు సినిమాలోకి ఇన్వాల్ అయినా క‌థ‌నం చాలా స్లోగా ఉంటుంది. 170 నిమిషాల ర‌న్‌టైంలో చాలా సీన్లు ట్రిమ్ చేయాల్సి ఉన్నా ఎడిట‌ర్‌ చోటా కె.ప్ర‌సాద్ ఎడిటింగ్ రూమ్‌లో ద‌ర్శ‌కుడు ఇచ్చిన సీన్ల‌ను పేర్చుకుంటూ వెళ్లిన‌ట్టుగానే ఉంది. ఇక పూజా - వరుణ్ మధ్య సన్నివేశాలు తక్కువే ఉన్నా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం చక్కగా కుదిరింది. ఇక అల‌నాటి సూప‌ర్ హిట్ సాంగ్ “ ఎల్లువొచ్చి గోదారమ్మ ” పాట కూడా సినిమాలో స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌.

కోలీవుడ్‌లో ఇప్ప‌టికే హిట్ అయిన జ‌గ‌ర్తండాకు తెలుగులో హ‌రీష్ చాలా మార్పులు చేసినా.... హరీష్ ఇంకా మార్పులు చేర్పులు చేసి.... ఇంకా ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించి ఉంటే బాగుండేది. రెండు గంటల యాభై నిమిషాల రన్‌టైమ్ కావ‌డంతో క్లైమాక్స్‌కు వ‌చ్చేస‌రికి సినిమా గ్రాఫ్ బాగా ప‌డిపోయిన‌ట్టే ఉంటుంది. ప్రీ క్లైమాక్స్‌కు ముందు మ‌రీ సాగ‌దీసేశాడు. అక్క‌డ వ‌చ్చే సీన్లు ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెడ‌తాయి. హ‌రీష్ మాస్ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడంలో తన బలాన్ని చూపించాడు.  హ‌రీష్‌ సినిమాను క్రిస్పీగా తీయ‌లేక‌పోయాడు. వ‌రుణ్ తేజ్ క్యారెక్ట‌ర్ మీద పెట్టిన కాన్‌సంట్రేష‌న్ సినిమా క‌థ‌నం మీద పెట్ట‌లేకపోయాడు. దీంతో క‌థ‌నం కంటే క్యారెక్ట‌ర్ బాగా హైలెట్ అయ్యింది.

ఈ సినిమాకు పెద్ద అసెట్ వరుణ్ తేజ్ నటన అని చెప్పాలి. గద్దలకొండ గణేష్ అనే పాత్రలో వరుణ్ పూర్తిగా ఒదిగిపోయాడు. సినిమా డైరెక్టర్ కావాలనుకునే పాత్రలో అథర్వ యాక్టింగ్ బాగుంది. అత‌డిని ఇంకా బెట‌ర్‌గా వాడుకుని ఉంటే బాగుండేది అనిపించింది. పల్లెటూరు అమ్మాయి పాత్రలో పూజా హెగ్డే బాగా నటించింది. వ‌రుణ్‌కు - పూజ‌కు మ‌ధ్య సీన్లు త‌క్కువుగా ఉండ‌డం కూడా కాస్త నిరాశ ప‌రుస్తుంది. మిగతా నటీనటులు వారి పాత్రల మేర బాగా నటించారు. అయ‌నాంక బోస్ సినిమాటోగ్రఫీ సినిమాను బాగా కలిసొచ్చింది. మిక్కీ జే మేయ‌ర్ సంగీతం బాగుంది. ఎడిటింగ్ ప‌రంగా ఫూర్‌గా ఉంది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

ఫైన‌ల్‌గా...
ఓవ‌రాల్‌గా చూస్తే గద్దలకొండ గణేష్ సినిమా మాస్ కామెడీ ఎంటర్టైనర్‌గా నిలుస్తుంది. వ‌రుణ్ యాక్టింగ్‌, అత‌డిని ఎలివేట్ చేసే సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నా సాగ‌దీత‌, గ్రిప్పింగ్ లేక‌పోవ‌డం... ఎమోష‌న్లు మిస్ అవ్వ‌డం లాంటి మైన‌స్‌లు కూడా ఉన్నాయి. మాస్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించే ఈ గ‌ణేష్ క్లాస్‌ను ఎంత వ‌ర‌కు ఎట్రాక్ట్ చేస్తాడు ?  బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌మ‌ర్షియ‌ల్‌గా కాసులు కురిపిస్తాడా ?  లేదా ? అన్న‌ది చూడాలి.

గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ రేటింగ్‌: 2.5 / 5