అత్యుత్సాహంతో సాయిరెడ్డి అడ్డంగా బుక్కయ్యాడే

September 22, 2020

నిజమే... పార్లమెంటులోని పెద్దల సభ రాజ్యసభలో అత్యుత్సాహం ప్రదర్శించిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్ది అడ్డంగా బుక్కైపోయారు. తనది కాని విషయంలోకి తల దూర్చి చైర్మన్ స్థానంలో ఉన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆగ్రహానికి గురయ్యారు. అంతేనా... నీది కాని విషయంలో జోక్యం ఎలా చేసుకుంటావు సాయిరెడ్డీ? అంటూ వెంకయ్య చేత చీవాట్లు కూడా తిన్నారు. అంతేకాదండోయ్... ఓ సారి వారించినా వినకుండా మరుమారు మాట్లాడేందుకు యత్నించిన సాయిరెడ్డిని... నీవేమైనా మంత్రి అనుకుంటున్నారా? వెంకయ్య ఏకంగా తలంటేసినంత పనిచేశారు. 

 

సాయిరెడ్డికి పెద్దల సభలో నిజంగా ఇంత పెద్ద అవమానం జరిగిందా? అంటే... వెంకయ్యనాయుడు చెడామడా తిట్టేసినంత పనిచేసిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన తర్వాత నిజమేనని చెప్పాలి. సాధారణంగా పార్లమెంటు సమావేశాల్లో లోక్ సభ సమావేశాలను చూపించినంతగా రాజ్యసభ సమావేశాలను టీవీ ఛానెళ్లు ప్రసారం చేయవు కదా. లోక్ సభ వాయిదా పడ్డప్పుడు మాత్రమే రాజ్యసభ లైవ్ వస్తుంది. అందుకేనేమో నిన్నటి రాజ్యసభ సమావేశాల్లో వెంకయ్య చేత చీవాట్లు తిన్న సాయిరెడ్డి ఉదంతం కాస్తంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

 

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోలో ఏముందన్న విషయానికి వస్తే.. ప్రజా ప్రతినిధుల మీద నమోదైన కేసుల దర్యాప్తు, వాటిని త్వరితగతిన పూర్తి చేసేలా ఏం చర్యలు తీసుకోవాలన్న అంశంపై రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రసంగింస్తూ వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన అక్రమాస్తుల కేసును ప్రస్తావించారు. అయితే ఓ సీఎం పేరును ప్రస్తావించరాదంటూ చైర్మన్ స్థానంలో ఉన్న వెంకయ్య.. రవీంద్రకుమార్ కు సూచించారు. అంతేకాకుండా రవీంద్రకుమార్ చేసిన సీఎం వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లుగా కూడా ప్రకటించారు. ఈ క్రమంలో అత్యుత్సహా ప్రదర్శించిన సాయిరెడ్డి.. కనకమేడల ప్రసంగానికి అడ్డు తగిలే యత్నం చేశారు. అయితే అప్పటికే కనకమేడలను నిలువరించేసిన వెంకయ్య... సాయిరెడ్డిని వారించారు. తాను ఉన్నాను కదా... మీరెందుకు జోక్యం చేసుకుంటారని సుతిమెత్తగానే సాయిరెడ్డిని వెంకయ్య వారించారు. 

దీంతో మిన్నకున్నట్లే కనిపించిన సాయిరెడ్డి... కనకమేడల ప్రసంగం ముగిసిన తర్వాత ఆయన స్పీచ్ పై స్పందించేందుకు యత్నించారు. ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకయ్య.,.. అసలు ఓ సభ్యుడు సభలో చేసిన ప్రసంగంపై వివరణ ఇచ్చేందుకో, స్పందించేందుకో? మీరేమీ మంత్రి అనుకుంటున్నారా? కాదు కదా? అంటూ వెంకయ్య ఓ రేంజిలో విసుక్కోవడంతో సాయిరెడ్డి తీవ్ర అవమానానికి గురై కూర్చుండిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇవ్వగా... ఇప్పుడా వీడియోలో వైరల్ గా మారిపోయాయి.‘నీవో ఏ2 ముద్దాయివి. మంత్రి అనుకుంటున్నావా?’ అంటూ సదరు వీడియోలకు నెటిజన్లు అదిరిపోయే కామెంట్లు జత చేసి సాయిరెడ్డిని ఓ ఆట ఆడుకుంటున్నారు.