విజయసాయిరెడ్డి కాపా? రెడ్డా?

September 21, 2020

వైసీపీలో నంబర్-2గా చెప్పే ఎంపీ విజయసాయిరెడ్డికి విశాఖపట్నంలో ఊహించని పరాభవం ఎదురైంది. అది కూడా ఇతర వైసీపీ నేతలు పాల్గొన్న ఒక కుల సమావేశంలో కావడం ఆ పార్టీ నేతలను ఆశ్చర్యపరిచింది. విశాఖపట్టణం జిల్లాలోని కంబాలకొండలో నిన్న నిర్వహించిన ‘కాపుల ఆత్మీయ కలయిక’ సభకు మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు విజయసాయిరెడ్డి వెళ్లారు.
అక్కడ ఆయన్ను చూడగానే కొందరు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘జై  కాపు.. జైజై కాపు’ అని నినదిస్తూ కాపుల సమావేశానికి విజయసాయిరెడ్డి ఎలా వస్తారంటూ మంత్రి అవంతిని ప్రశ్నించారు. దీంతో కార్యక్రమంలో కొద్దిసేపు ఘర్షణ చోటు చేసుకుంది. విజయసాయిరెడ్డి వారికి నచ్చజెపుతూ తానూ కాపునేనని చెప్పుకొచ్చారు. తాను చనిపోయినప్పుడు తన డెత్ సర్టిఫికెట్ మీద కూడా అదే ఉంటుందన్నారు.
కాగా ఇదే కార్యక్రమానికి హాజరైన మంత్రి అవంతి మాట్లాడుతూ కార్యక్రమ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంత్రి పదవిలో ఉండడం వల్లే సహనంగా ఉన్నానని తీవ్ర స్వరంతో అన్నారు. జిల్లా నుంచి  తనకు మాత్రమే మంత్రి పదవి దక్కిందన్నారు. అలాంటిది పార్టీ కీలక నేత ఒకరు వస్తే ఇలా అవమానిస్తారా అంటూ వారిపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు కాపు రిజర్వేషన్ గురించి మాట్లాడగా మంత్రి అవంతి అడ్డుకున్నారు. అయితే, విజయసాయిరెడ్డి ఈ సమావేశంలో తాను కాపునని చెప్పడంపై అక్కడ ఆశ్చర్యం వ్యక్తమైంది.