నివేదికలు .. ఉత్తిత్తివే అని నిరూపించారుగా !!

September 22, 2020

బొత్సనో, ఇంకో మంత్రో, ఇంకో నేతో మొహమాట పడుతున్నారు గానీ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాత్రం ఏం మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు. ఏపీ నూతన రాజధాని విశాఖపట్నంలోనే ఏర్పాటు చేస్తామని స్పీకర్‌ తమ్మినేని సీతారాం స్పస్టంగా ప్రకటించారు.  ఎడ్యుకేషన్‌ హబ్‌గా అమరావతి అభివృద్ధి చెందుతుందని, విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా ఉంటుందని, కర్నూల్లో హైకోర్టు ఏర్పాటవుతుందని... ఇందులో ఎటువంటి సందేహం లేదని స్పష్టం చేశారు. విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తే మీకు వచ్చే నష్టం ఏమిటని టీడీపీ నేతలను ప్రశ్నించారు.

ఒకవైపు జగన్ కేబినెట్ మీటింగ్ పెట్టి  బీసీజీ నివేదిక వచ్చాకే నిర్ణయం అని చెబుతాడు. కేబినెట్ వివరాలు అధికారికంగా వెల్లడించిన మంత్రి ఏమో... అసలు వైజాగ్ అని చెప్పడానికి విజయసాయిరెడ్డి ఎవరు అంటాడు. బొత్స ఏమో... వైజాగ్ మంచిదని నా వ్యక్తిగత అభిప్రాయం అంటాడు. కానీ తమ్మినేని సీతారాం పోకిరి సినిమా స్టైల్లో తేల్చిపడేశాడు. ఈ ఉప్పర్ మీటింగులన్నీ కాదు గాని... వైజాగే ఏపీ రాజధాని, ఏం చేస్కుంటారో చేస్కోండి అని తేల్చేశారు. అంటే మొన్నటి కేబినెట్ మీటింగ్ గాని, అందులో చెప్పిన బీసీజీ గాని, హైపవర్ కమిటీ నివేదిక  గానీ అన్నీ డమ్మీ అని తేల్చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.

అమరావతిలో భూములను కొన్న వారు, అక్కడున్న రైతులను రెచ్చగొట్టడం వల్ల రైతులు ధర్నాలు చేస్తున్నారు గాని లేకపోతే వారందరికీ అమరావతి అక్కర్లేదు అన్నట్టు మాట్లాడారు స్పీకర్ గారు. అయినా డబ్బులు ఖర్చు పెట్టి ఇంతకాలం ధర్నా చేయించడం ఎవరి తరం అయినా అవుతుందా? కొన్ని వేల మందికి రోజుకు ఎంత ఖర్చు పెట్టి ధర్నాలు చేయించాలి. కనీసం లెక్కేసుకుని మాట్లాడాలి కదా. పెయిడ్ ఆర్టిస్టుల్లో అంత ఆవేదన ఎందుకు ఉంటుంది?  అనే మినిమమ్ ఆలోచన చేయాలి కదా.