రాసింది అందరూ.. ఖండన మాత్రం ఈనాడు ఖాతాకే..

September 24, 2020
CTYPE html>
రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తాజాగా భేటీ కావటం.. రెండు గంటల పాటు అధికారుల మధ్యన.. మరో రెండు గంటలు ఏకాంతంగా ఇరువురు అగ్రనేతలు భేటీ కావటం తెలిసిందే. ఈ భేటీకి సంబంధించి పలు మీడియాల్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అన్నింటిలోనూ దాదాపు ఒకేలాంటి అంశాలు కవర్ అయ్యాయి.
ఏపీ అధికారపక్షానికి చెందిన సాక్షి.. తెలంగాణ అధికారపక్షానికి చెందిన నమస్తే తెలంగాణలో మినహాయిస్తే మిగిలిన అన్ని పత్రికల్లోనూ (తెలుగు.. ఇంగ్లిషు)  దాదాపు ఒకేలాంటి కంటెంట్ వచ్చింది. కాకుంటే.. ఒకరు సున్నితంగా రాస్తే.. మరికొందరు కాస్త తీవ్రంగా రాశారు. ఇదంతా కూడా వార్తను చెప్పే తీరులో తేడా తప్పించి.. విషయంలో ఎక్కడా మార్పు లేదు.
ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కేంద్రంలోని మోడీ సర్కారు విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లుగా వచ్చిన వార్తల్ని తాజాగా తప్ప పడుతోంది ఏపీ సీఎంవో. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య జరిగిన భేటీలో అబద్ధాలు.. అసత్యాలు రాసినప్పుడు ఖండించటం తప్పేం కాదు. కానీ.. కేంద్రం విషయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు అసంతృప్తిగా ఉన్న విషయంతో పాటు.. నిధుల కేటాయింపులో కేంద్రం తీరు బాగోలేదని.. ఉమ్మడిగా పోరాడాలన్న మాట వారి మధ్య చర్చకు వచ్చినట్లుగా రాశారు.
అయితే.. ఇలాంటివేమీ జరగలేదని చెబితే సరిపోయేది. కానీ.. ఇదంతా ఎల్లో మీడియాకు చెందిన ఈనాడులో మాత్రమే వచ్చినట్లుగా పేర్కొంటూ.. ఖండన నోట్ ను ప్రత్యేకంగా విడుదల చేయటం ఆసక్తికరంగా మారింది. కేంద్రంపై అసంతృప్తితో ఉన్నట్లుగా రాశారని.. అది ఊహాజనితమైనదే తప్పించి నిజం కాదన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని ఏపీ సీఎంతో హితవు పలుకుతూ ఒక ఖండన నోట్ విడుదల చేసింది. ఇందులో ఈనాడు కథనాన్ని ఖండిస్తున్నట్లుగా పేర్కొనటంతో పాటు.. ఇదంతా ఉద్దేశపూర్వకంగా రాసిన కథనంగా తాము భావిస్తున్నట్లుగా ప్రకటించింది.  
కేంద్రం తీరుపై అసంతృప్తిగా ఉన్నారంటూ తెలుగులో ఈనాడు.. ఆంధ్రజ్యోతి.. వెలుగు.. సూర్యలతో పాటు ఇంగ్లిషు పత్రికలైన టైమ్స్ ఆఫ్ ఇండియా.. డీసీ తదితర మీడియా సంస్థల్లో వచ్చింది. అయితే.. ఒక్క ఈనాడులోనే ఈ తరహాలో వార్త వచ్చినట్లుగా ఖండన తయారు చేయించటం మాత్రం విశేషమని చెబుతున్నారు. రాసింది అందరూ అయితే.. ఖండన మాత్రం ఒక్కరి పేరు మీద రావటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది.