అమరావతిపై ఏపీ సర్కారు సంచలన ప్రకటన

September 21, 2020

ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అమరావతి నగరం స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ఎన్నికల ముందే అక్కడ రియల్ వ్యాపారం ఆగిపోయింది. ఎన్నికల అనంతరం జగన్ గెలిచాక అన్ని వ్యాపారాలు సన్నగిల్లాయి. అమరావతిపై అందరూ ఆశలు వదిలేసుకున్నారు. పుండు మీద కారం చల్లినట్టు... అసలే జనం వేదనలో ఉంటే... అమరావతి పనికిరాదు, అమరావతిమునిగిపోతుంది, అమరావతి అంతపెద్దది అవసరం లేదు వంటి విచిత్రమైన వాదనతో ఏపీ సర్కారు ప్రజల్లో మరింత అయోమయాన్ని సృష్టించింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే... అధికారిక హోదాలో అమరావతిని స్వయంగా వైసీపీ సర్కారే చంపేసింది. 

జాతీయ మీడియా కూడా అమరావతి శ్మశాన నగరం అని కథనాలు రాసింది. చంద్రబాబు ప్రాజెక్ట్ కి జగన్ నీళ్లొదిలేశారని అందరూ ఫిక్సయిపోయారు. కేవలం అమరావతిని పట్టించుకోకపోవడం మాత్రమే కాదు, ముఖ్యమంత్రి అన్ని పనులు ఆపేయాలని చెప్పడంతో రాజధాని అక్కడ నుంచి మారుస్తారు అని ప్రచారం జరిగింది. అనంతరం పట్టణాభివృద్ధి మంత్రి అయిన బొత్స పదేపదే అమరావతిలో ఏం లేదు, అమరావతి ఎందుకు అనడంతో పూర్తి అమరావతి మరుగున పడింది. 

తాజాగా ప్రభుత్వం అమరావతే రాజధాని. దానిని మార్చేది లేదు అంటూ చట్టసభల్లో కన్ ఫం చేసింది. తెలుగుదేశం సభ్యులు శాసనమండలిలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ మంత్రి బొత్స సత్యానారాయణ దీనిపై క్లారిటీ ఇచ్చారు.  చట్టసభల్లో చేసిన ప్రకటన కావడంతో అమరావతితో అనుంబంధం ఉన్నవాళ్లు, అక్కడ పెట్టుబడులు పెట్టిన వారు, రైతులు అందరూ హర్షం వ్యక్తంచేస్తున్నారు. 

ఇదిలా ఉండగా... ఇటీవల కాశ్మీర్ విభజన తర్వాత కేంద్రం విడుదల చేసిన కొత్త మ్యాపులో ఏపీ రాజధానిగా అమరావతిని ప్రస్తావించకపోవడంతో ఏర్పడిన గందరగోళం ఆ తర్వాత పార్లమెంటులో తెలుగుదేశం వారి పోరాటంతో సరిదిద్దారు. వాస్తవానికి ఒక రాజధానిని రాజకీయ కారణాలతో ఒక చోట నుంచి ఇంకోచోటుకు మార్చడం అంత ఈజీ కాదు. ప్రజలు అందరూ భయపడినట్టు అమరావతిని మార్చడం సాధ్యం కాదు. అది కేంద్రం నుంచి రాష్ట్రం వరకు గెజిట్ మార్చాల్సిన వ్యవహారం. దానికి ముడిపడి ఎన్నో అంశాలుంటాయి .... ప్రస్తుత పరిస్థితిలో జగన్ అంత రిస్కు తీసుకునే పరిస్థితి లేదు. రాష్ట్రానికి ఆ శక్తి లేదు. దేశానికి ఆ అవసరం లేదు. వెరసి... అమరావతి అనేది శాశ్వతం. ఏపీకి అమరావతే రాజధాని. కానీ దానిని జీర్ణించుకోవడానికి వైసీపీకి ఇంతకాలం పట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే... బొత్స చెప్పాల్సింది ’’అమరావతిని మార్చం‘‘ అని కాదు... ‘‘మేము అమరావతి నుంచి రాజధానిని మార్చలేం’’ అని చెప్పాలి.