నాటి బాబు మాట... నేడు కేజ్రీ నోట

September 22, 2020

ఎన్నికలు ఏవైనా.. గెలుపే పరమావధి అయినప్పుడు అధికారంలోని పార్టీలు అడ్డదారులు తొక్కడం మనకు తెలిసిందే. ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు నానా తంటాలు పడటం, కుదరకపోతే... అధికారులను బెదిరించి పోలింగ్ సరళిని తమకు అనుకూలంగా మలచుకోవడం, అదీ కుదరకపోతే... ఏకంగా ఈవీఎంలనే ట్యాంపరింగ్ చేయడం... ఇలా ఎన్నెన్నో మార్గాలు. కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఈ తరహా పనులే చేస్తున్నట్లుగా చాలా రోజుల నుంచి అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు నిజమేనన్నట్టుగా శనివారం పోలింగ్ జరిగిన తీరును పరిశీలించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సంచలన కామెంట్ చేశారు. ఈవీఎంలను బీజేపీ సర్కారు ట్యాంపరింగ్ చేసి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేయడం ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.

బీజేపీపై ఈ తరహాలో ఇప్పుడు ఇలాంటి ఆరోపణ రాలేదు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తనకు ప్రతికూలంగా ఉన్న చాలా ప్రాంతాల్లో బీజేపీ ఈవీఎంల ట్యాంపరింగ్ కు పాల్పడిందని టీడీపీ అధినేత, నాడు ఏపీ సీఎంగా ఉన్న నారా చంద్రబాబునాయుడు సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాకుండా అవకాశం ఇస్తే ఈవీఎంలను ఎలా ట్యాంపరింగ్ చేస్తారో కూడా చేసి చూపిస్తామంటూ చంద్రబాబు తన ప్రతినిధిని ఈసీ వద్దకు పంపేందుకు కూడా సిద్ధపడిన వైనం మనకు తెలిసిందే. అయితే నాడు చంద్రబాబు ఆరోపణలను అటు బీజేపీ సర్కారుతో పాటుగా ఇటు ఈసీ కూడా తేలిగ్గా కొట్టిపారేశాయి. అయితే చంద్రబాబు అనుమానించినట్లుగానే తన పార్టీ ఘోర పరాజయం పాలైంది. పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతాల్లో కూడా వైసీపీకి విజయం దక్కిందంటే చంద్రబాబు అనుమానపడినట్టుగా ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందా? అన్న అనుమానాలు రేకెత్తాయి. 

సరే... నాడు దీనిపై చంద్రబాబు మరింతగా పోరాటం చేసేందుకు అవకాశం లేకుండా చేశారన్న వాదనలు లేకపోలేదు. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానూ నాడు చంద్రబాబు అనుమానపడినట్టుగానే... ఇప్పుడు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే కుట్ర జరుగుతుందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈవీఎం స్ట్రాంగ్ రూంల వద్ద కాపలగా ఉండాలంటూ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పోలింగ్ శాతాన్ని ఆలస్యంగా ప్రకటించడంపై.. అరవింద్ కేజ్రీవాల్ ఈ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఎప్పటిలానే ఈసీ ఈ సారి కూడా కేజ్రీ ఆరోపణలను చాాలా తేలిగ్గా కొట్టిపారేసింది.