టిట్ ఫర్ ట్యాట్ : జగన్ ను పరుగులు పెట్టించింది ఎవరు?

September 21, 2020

వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైెఎస్ జగన్ మోహన్ రెడ్డి మొన్న ఉన్నపళంగా ఢిల్లీ పర్యటనకు పరుగులు పెట్టిన విషయం గుర్తుంది కదా. ఓ సీఎం హోదాలో ముందస్తుగా నిర్ణయమైన షెడ్యూల్ ప్రకారమే ముందుకు సాగుతుంటారు. ఇక దేశ రాజధాని ఢిల్లీ పర్యటన విషయానికి వస్తే... ఢిల్లీలో తాను ఎవరెవరిని కలవాలనుకుంటున్నారో, వారి అపాయింట్ మెంట్లను ఆధారం చేసుకున్న తర్వాతే ఫ్లైట్  ఎక్కుతారు. అలా కాకుండా ముందస్తు షెడ్యూల్ లేకుండానే... ఉన్నపళంగా తన షెడ్యూల్ ను మార్చేసుకుని జగన్ ఢిల్లీకి పరుగులు పెట్టారు. అంత ఆఘమేఘాల మీద జగన్ ఢిల్లీకి పరుగులు పెట్టినా... అక్కడ మాత్రం ఆయన ఏ ఒక్కరిని కూడా కలవలేకపోయారు. అసలు ఈ పర్యటన వెనుక ఉన్న కారణాలేమిటన్న విషయంపై ఇప్పుడు ఓ ఆసక్తికర అంశం ఉందన్న వాదన వినిపిస్తోంది. అది కూడా జగన్ తీసుకున్న ఓ నిర్ణయానికి పర్యవసానమేనన్న వాదన మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఆ కారణమేమిటన్న వివరాల్లోకి వెళితే... టీడీపీ హయాంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును... సీఎం కుర్చీపై కూర్చోగానే జగన్ బదిలీ చేసి పారేశారు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించిన కారణంగానే ఏబీని జగన్ బదిలీ చేశారని, ఈ బదిలీ కక్షసాధింపులో భాగమనన్న వాాదన కూడా వినిపించింది. సరే అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బదిలీ చేస్తే... ఏ అధికారి అయినా సదరు పోస్టును ఖాళీ చేయాల్సిందే కదా. అలాగే ఏబీ కూడా మారు మాట్లాడకుండానే ఇంటెలిజెన్స్ చీఫ్ పదవిని వదిలి వెళ్లారు. ఈ పోస్టుకు సరైన అధికారి దొరకని జగన్... చాలా కాలం పాటు దానిని ఖాళీగానే ఉంచారు. తాజాగా సదరు పోస్టులో కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన మనీష్ కుమార్ సిన్హాను అపాయింట్ చేశారు. 

ఈ పోస్టింగే జగన్ ను ఢిల్లీకి పరుగులు పెట్టించిందట. అదెలాగంటే... మనీష్ కుమార్ సిన్హా గతంలో కేంద్ర సర్వీసుల్లో భాగంగా సీబీఐ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేశారు. అంతేకాకుండా సీబీఐలో మొన్నామధ్య కొనసాగిన పెను వివాదం మొత్తానికి సిన్హానే కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, ఆయన తర్వాతి పోస్టులో ఉన్న సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాల మధ్య ఓ రేంజిలో వివాదం జరిగింది. ఈ మొత్తం వివాదంలో సిన్హా కోర్టుకెక్కడంతో పాటుగా ఏకంగా సీబీఐ అంతర్గత వ్యవహారాలు ఇలా సాగుతున్నాయంటూ ఓ సీల్డ్ కవర్ లేఖను కూడా ఆయన సుప్రీంకోర్టుకు పంపారు. ఈ లేఖ ఆధారంగా సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు కేంద్రంలోని బీజేపీ సర్కారుకు, ప్రత్యేకించి కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్న అమిత్ షాకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఆస్థానాను కేంద్రం పక్కనపెట్టాల్సి వచ్చింది. అంటే... బీజేపీకి చిర్రెత్తుకొచ్చేలా చేసింది సిన్హానేనన్న మాట.

ఇవేవీ పట్టని జగన్... సిన్హా కేంద్ర సర్వీసుల నుంచి ఏపీకి తిరిగి రాగానే... ఆయనను ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించేశారు. ఈ విషయం తెలుసుకున్న అమిత్ షా అగ్గి మీద గుగ్గిలమయ్యారట. కేంద్ర దర్యాప్తు సంస్థ పరువును బజారకీడ్చిన సిన్హాకు ఇంటెలిజెన్స్ చీఫ్ లాంటి కీలక పదవి ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట. అమిత్ షా ఆగ్రహాన్ని ఏదోలా తెలుసుకున్న జగన్.. సంజాయిషీ ఇచ్చుకునేందుకే ఢిల్లీకి పరుగులు పెట్టారట. అయితే తనకు షాకిచ్చిన అధికారిని అందలం ఎక్కించిన జగన్ కు తొలుత అపాయింట్ మెంట్ ఇచ్చినట్టే ఇచ్చిన అమిత్ షా... ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగానే అపాయింట్ మెంట్ ను రద్దు చేశారట. అంటే... ఏ కారణం లేకుండానే ఏబీపై బదిలీ వేటు వేసిన జగన్...ఏబీ స్థానంలో సిన్హాను నియమించి చిక్కుల్లో పడ్డారన్న మాట. అంటే టిట్ ఫర్ ట్యాట్ అన్న మాటేగా.