ఎవరీ భూమన్న.. ఆయన అరెస్ట్ ఎందుకంత సంచలనమైంది?

September 24, 2020

ప్రజాస్వామ్య భారతంలో ఎన్నికల్లో పోటీ చేయాలంటే? బరిలోకి దిగేందుకు అవసరమైన అర్హతలు ఉంటే సరిపోతుంది. అదే నిజమైతే.. అర్థరాత్రి వేళ హూజూర్ నగర్ వెళ్లే దారిలో తెలంగాణ సర్పంచుల సంఘం గౌరవాధ్యక్షుడు సౌదాని భూమన్నను ఎందుకు అరెస్ట్ చేశారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. తెలంగాణ అధికార పక్షానికి సవాలుగా మారిన హూజుర్ నగర్ ఉప ఎన్నికలో ఎలాంటి ట్విస్ట్ లు ఉండకూడదన్న ఉద్దేశంతోనే సర్పంచుల ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు భూమన్న వెళుతుంటే.. ఆయన్ను అడ్డుకొని అక్రమంగా అరెస్ట్ చేశారన్న ఆరోపణ ఇప్పుడు రాజకీయ కలకలంగా మారింది.
దీర్ఘకాలంగా సర్పంచుల డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్న వేళ.. తాజాగా తెర మీదకు వచ్చిన హూజుర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు తెర తీయటంతో ప్రభుత్వానికి తమ సత్తా చాటాలని సర్పంచుల సంఘం భావించింది. ఆ మధ్యన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో పసుపు రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం రైతులంతా కలిసి భారీ ఎత్తుననామినేషన్లు వేయటం.. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఓడిపోవటం తెలిసిందే.
ఇదే ఫార్ములాను కాస్త మార్చి సర్పంచుల సంఘం తరఫున బరిలో నిలిచేందుకు భూమన్న రెఢీ కావటం.. ఆయన్ను అదుపులోకి తీసుకొన్న తీరు ఇప్పుడు వేలెత్తేలా చేస్తోంది. ఈ అరెస్ట్ కు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. సినిమాటిక్ గా ఉన్న ఈ ఉదంతంలో ప్రభుత్వం పాత్రను పలువురు అనుమానిస్తున్నారు. నామినేషన్ వేసేందుకు హూజుర్ నగర్ కు బయలుదేరిన భూమన్నతో పాటు మరికొందరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నల్లగొండ జిల్లా నకిరేకల్ దాటిన తర్వాత భూమన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయన్ను కడెంలో అరెస్ట్ చూపించటం గమనార్హం. అర్థరాత్రి వేళ.. యాభై మంది సివిల్ డ్రెస్ లో ఉన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక్కసారిగా వచ్చి భూమన్నను అదుపులోకి తీసుకోవటం ఏమిటన్నది ప్రశ్నగా మారింది. ఆయనేమీ ఆచూకీ లేకుండా పోయిన బడా క్రిమినల్ కాదు. ప్రజల్లో తిరిగే నేత. అలాంటప్పుడు ఆయన్ను ఇంతలా అడ్డుకొని మరీ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం లభించని పరిస్థితి.
ఆయనతో పాటు రాష్ట్ర సర్పంచ్ ల అధ్యక్షురాలు జూలూరు ధనలక్ష్మి.. సర్పంచ్ మల్లేశ్ తో పాటు పలువురు సర్పంచ్ లు ఉననారు. వీరిని మూడు వాహనాల్లో ఎక్కించి ఎల్బీనగర్.. ఉప్పల్.. సికింద్రాబాద్ మీదుగా ప్యాట్నీసెంటర్ లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. అనంతరం ధనలక్ష్మి భర్తకు సమాచారం ఇవ్వటంతో ఆయన హుటాహుటిన టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎందుకు అరెస్ట్ చేశారంటే.. పై నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పటం మినహా ఇంకేమీ సమాధానం ఇవ్వటం లేదని చెబుతున్నారు.
దీంతో బీజేపీ నేత డీకే అరుణకు ఈ విషయాన్ని చెప్పటం.. ఆమె కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి సమాచారం ఇవ్వటంతో ఆయన డీజీపీతో మాట్లాడారు. భూమన్న మినహా మిగిలిన వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు రిలీజ్ చేయటం గమనార్హం. భూమన్న విడుదల గురించి ప్రశ్నిస్తే.. నిర్మల్ లో ఆయన్ను సరెండర్ చేస్తామని చెప్పి.. కడెం పోలీసులు ఆయన్ను కోర్టుకు హాజరుపర్చారు. సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి రూ.5లక్షలు తీసుకున్న కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారు. కోర్టు ఆయనకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తంగా భూమన్న అరెస్ట్ ఇప్పుడురాజకీయంగా కొత్త కలకలానికి తెర తీసిందన్న మాట బలంగా వినిపిస్తోంది. ఈ ఉదంతం హూజుర్ నగర్ ఉప ఎన్నిక మీద ఎంతమేర ఉంటుందన్నది కాలమే సరైన సమాధానం ఇవ్వగలదేమో?