ఈ పని అపుడే చేసి ఉండాల్సింది బాబు !!

September 21, 2020

చంద్రబాబు విజనరీ అనేది సగం మాత్రమే నిజం. అవును అతనికి రాష్ట్ర భవిష్యత్తుకు ఎపుడు ఎలాంటి అడుగులు వేయాలి, సమాజానికి ముందు జాగ్రత్తగా ఏం చేయాలి, భావితరాలకు ఎలాంటి అవసరాలు ఉంటాయో అంచనా వేసి ఎలా వాటికి పునాదులు వేయాలో మాత్రమే తెలిసిన విజనరీ. కానీ పార్టీకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది, ప్రత్యర్థులు మన పార్టీని ఎన్నిరకాలుగా దెబ్బతీసే అవకాశం ఉంది? మరో పాతికేళ్లు పార్టీకోసం నిలబడే కొత్త యువ నాయకత్వం ఎలా తయారచేయాలి... ఇలాంటివన్నీ ఆలోచించి పార్టీని ఒడిదుడుకులకు గురి కాకుండా చేయగలిగిన విజన్ మాత్రం చంద్రబాబు వద్ద లేదు. 

ప్రతిపక్షంలో ఉన్న వారు... అనుభవం, అధికారం ఉన్న వ్యక్తిని ఓడించారు అంటూ... అంటే కచ్చితంగా అది స్వయంకృతాప రాధమే. ఒకవేళ ప్రత్యేర్థి అడ్డదారుల్లో అధికారం చేపట్టాడు అనుకుంటే... మరి అలాంటి తప్పుడు దారిలో నడుస్తున్నపుడు జాగ్రత్తపడి దానిని అదుపుచేయడంలో చంద్రబాబు విఫలం అయినట్టే అనుకోవాలి. అయితే, అధికారంలో ఉన్నప్పటి కంటే... ప్రతిపక్షంలో ఉన్నపుడే చంద్రబాబు రాజకీయ వ్యూహాలు సరిగ్గా పన్నుతాడు అనిపిస్తుంది. దానికి తాజాగా ఆయన చేసిన ఒక కామెంట్ ను ఉదహరించొచ్చు. ‘‘టీడీపీ భూస్థాపితం అవుతుందంటున్న వారికి టీడీపీ ఏంటో చూపిస్తానని, 30 ఏళ్ల పాటు నిలబడగలిగే నాయకత్వాన్ని అందిస్తానని’’ చంద్రబాబు వ్యాఖ్యానించారు.  యువతకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా టీడీపీని మరింత బలోపేతం చేస్తానని ఆయన చెబుతున్నారు. ఇది బానే ఉంది. మరి ఇదే పని ఇపుడు ఇన్ని అడ్డంకులు ఎదుర్కొని చేయాలి. అధికారంలో ఉన్నపుడే చేసి ఉంటే ఎంత బాగుండేది, ఎంత సులువుగా ఉండేది? ... ఇవి సగటు తెలుగుదేశం అభిమాని సోషల్ మీడియాలో వేస్తున్న ప్రశ్నలు. 

ఇప్పటికే టీడీపీలో ఉన్న కీలకనేతలు అంతా ఓల్డేజ్ గ్యాలరీ. మరి దీనిని గుర్తించి భవిష్యత్తుని ఎందుకు ఇంతకాలం నిర్మించలేదు? ప్రతిజిల్లాకు ఒక చింతమనేని, రామ్మోహన్ నాయుడు, ధూళిపాళ్ల వంటి వారిని ఎందుకు తయారుచేయలేదు. అధికారంలో ఉన్నపుడు ఎంత సేపు అధికారులతో గంటలు గంటలు సమీక్షలు. వాటితో ఇమేజ్ పెరగకపోగా డ్యామేజీ కూడా ఎక్కువే. కానీ ఏ నాడు పార్టీకి చంద్రబాబు తగినంత సమయం కేటాయించలేదు. అధికారంలో ఉన్నపుడే పార్టీకి భావితరాలకు సరిపడే జవసత్వాలున్న మెరికల్లాంటి నాయకులను తీర్చిదిద్ది ఉంటే ఫలితం మరోలా ఉండేది. కానీ ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అయితే... ఈ పని అపుడెందుకు చేయలేదు అన్న ప్రశ్న మాత్రం సరయిన కొత్తతరం వచ్చేవరకు వినిపిస్తు ఉంటుంది.