బీజేపీతో దోస్తీ: పవన్ కళ్యాణ్ మరోసారి తప్పులో కాలేశారా? 

September 23, 2020

2014లో రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ, టీడీపీలకు అండగా నిలబడిన జనసేనాని పవన్ కళ్యాణ్ 2019లో ఏపీలో లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేశారు. ఎన్నికల్లో దారుణ పరాభవం అనంతరం బీజేపీతో కలిసి ప్రజా సమస్యలపై ఉద్యమించేందుకు సిద్ధమయ్యారు. నిన్న లెఫ్ట్‌తో కలిసినప్పుడు జనసేనానిపై బీజేపీ విమర్శలు గుప్పించగా, ఇప్పుడు కమలం పార్టీతో దోస్తీపై కమ్యూనిస్టులు భగ్గుమంటున్నారు.

బీజేపీతో జతకట్టి జనసేనాని తప్పులో కాలేశారా అనే చర్చ సాగుతోంది. ఎన్నికల సమయంలో కమ్యూనిస్టులతో జత కట్టినప్పుడు అదో విఫల పొత్తు అని అభిప్రాయపడిన వారు ఉన్నారు. పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఇమేజ్‌ను లెఫ్ట్ సొమ్ము చేసుకోవడం మినహా జనసేనకు వచ్చేది ఏమీ లేదనే వాదనలు వినిపించాయి. రాజకీయ నిపుణులు భావించినట్లే ఈ పొత్తు ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేదు. స్వయంగా రెండింటా ఓడిన పవన్.. తమ పార్టీ తరఫున ఒకే ఒక ఎమ్మెల్యేను గెలిపించుకోగలిగారు.

ఇప్పుడు ఏపీలో ఏమాత్రం ప్రభావం.. బలం లేని బీజేపీతో కలిశారనే అంటున్నారు. పైగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని స్పష్టంగా తేల్చి చెప్పిన తర్వాత కలవడం ఏమిటనేది ప్రత్యర్థుల వాదన. ఇప్పుడు కూడా ఆయనను కమలం పార్టీ సొమ్ము చేసుకుంటుందని, కానీ ప్రజా సమస్యలపై అయిదేళ్లుగా ఉద్యమిస్తున్న ఆయనకు ఆ పార్టీతో కలవడం వచ్చే లాభం ఏమీ లేదని అంటున్నారు.

విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందో.. హోదా ఇవ్వలేమని తేల్చేశాక కమలం పరిస్థితి అదే అంటున్నారు. అలాంటి పార్టీతో కలిసి జనసేనాని ప్రజల్లోకి వెళ్లినా ఫలితం లేదని ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ప్రధానంగా విభిన్న అభిప్రాయాలు కలిగిన బీజేపీ, జనసేనాని ఎలా కలుస్తారని లెఫ్ట్ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఆయనపై భగ్గుమంటున్నాయి.

అయితే పొత్తుకు, కలిసి ఉద్యమించేందుకు సంబంధం లేదని, ప్రభుత్వ తీరు వల్ల రాజధాని అంశం అట్టుడుకుతూ అమరావతి ఆగ్రహం ఉవ్వెత్తున ఎగుస్తున్న సమయంలో సిద్ధాంతాలను పక్కన పెట్టి ప్రజల కోసం పోరాటం చేసే పంథాను జనసేనాని ఎంచుకున్నారని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో బద్ద రాజకీయ శత్రువులైన బీజేపీ, కమ్యూనిస్టులు వేదికను పంచుకున్నాయని గుర్తు చేస్తున్నారు. తాజా రాజకీయ పరిస్థితుల వల్ల బీజేపీతో కలిసి ఉద్యమిస్తున్నారని, కలిసి పోటీ చేస్తారా అంటే.. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని అంటున్నారు.