వైసీపీ ఎంపీలు... జగన్ మాట అస్సలు వినట్లేదే

September 24, 2020

వైసీపీలో ఇప్పుడు ఓ వింత పరిస్థితి చోటుచేసుకుంది. పార్టీ అధినేత హోదాలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి... తన పార్టీ నేతలకు ప్రత్యేకించి పార్లమెంటు సభ్యులు జారీ చేసిన ఆదేశాలు అస్సలు అమలు కావడం లేదు. ఎమ్మెల్యేలు ఓ మోస్తరుగా జగన్ మాటను దాటకున్నా... ఢిల్లీలో ఉంటున్న ఎంపీలు మాత్రం జగన్ మాటలను అస్సలు లెక్క చేయట్లేదు. జగన్ మాట లెక్క చేయకపోవడం అటుంచితే... జగన్ చేయొద్దన్న పనినే చేస్తూ ఎంపీలు జగన్ కు వరుస షాకులిస్తున్నారు. మొన్నటికి మొన్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు... తొలుత మోదీతో పలకరింపులతో కలకలం రేపగా... ఆ వివాదాన్ని పరిష్కరించుకునే నిమిత్తం జగన్ వద్దకు వచ్చి తిరిగి ఢిల్లీ వెళ్లి ఏకంగా బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలోనే ప్రత్యక్షమయ్యారు. 

 

తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నేరుగా ప్రధాని నరేంద్ర మోదీతోనే భేటీ అయ్యారు. మోదీతో మాగుంట భేటీ ఇప్పుడు వైసీపీలో ఓ రకమైన కలకలాన్నే రేపనుందని చెప్పక తప్పదు. పార్టీ ఎంపీలు ఎవరైనా బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు... చివరకు ప్రధాని మోదీని కలవాలని అనుకుంటే... పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి, లోక్ సభలో పార్టీ నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిల అనుమతి తీసుకోవాలని జగన్ కాస్తంత గట్టిగానే చెప్పారు. అయితే జగన్ మాటను మాత్రం పట్టించుకున్న దాఖలా వైసీపీ నేతల్లో కనిపించడం లేదు. ఓ వైపు అధినేత వద్దు వద్దంటున్నా కూడా వైసీపీ ఎంపీలు క్యూ కట్టినట్టుగా ఒక్కొక్కరుగా వెళ్లి బీజేపీ అగ్ర నాయకులతో భేటీ అవుతున్న వైనం చూస్తుంటే... జగన్ కు త్వరలోనే బిగ్ షాకింగ్ లు తప్పవేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

 

మోదీతో మాగుంట భేటీ విషయానికి వస్తే... లోపల ఏఏ అంశాలపై చర్చ జరిగిందన్న విషయం ఎలాగూ బయటకు రాదు గానీ... మాగుంట వివరణ ఏమిటంటే... ఏపీలో మానవ హక్కుల కమిషన్ ను ఏర్పాటు చేయాలని, కేంద్రం ఆధీనంలోని పొగాకు బోర్డులో ఏపీ వాసులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరేందుకే ఆయన ప్రధానిని కలిసినట్లుగా చెబుతున్నారు. అయినా ఈ విషయాలను చర్చించేందుకు ప్రధాని మోదీ వద్దకు మాగుంట ఒక్కరే వెళ్లాల్సిన పని లేదు కదా. కీలకమైన అంశాలే కాబట్టి... పార్టీకి చెందిన ఇతర ఎంపీలను, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డిలను కూడా వెంటేసుకుని వెళ్లి ఉంటే.. మరింత ఫలితం ఉండేది కదా. అలా కాకుండా సింగిల్ గానే మోదీ వద్దకు మాగుంట వెళ్లారంటేనే... డౌటు వస్తోంది. మరి మోదీతో మాగుంట భేటీ వైసీపీని ఏ తరహా ఇబ్బందులకు గురి చేస్తుందో చూడాలి.