వివేకా కూతురు... జగన్ పై నమ్మకం లేదనేసింది

September 21, 2020

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకా హత్య కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా, వివేకా కుమార్తె సునీత సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ కేసు సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే, ఈ పిటిష‌న్ వెనుక వైఎస్ కుటుంబంలోని లుక‌లుక‌లు స్ప‌ష్ట‌మైన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 14వ తేదీన తన ఇంట్లోనే దారుణంగా హత్యకు గురయ్యారు. వైఎస్ వివేకా హత్య జరిగినప్పుడు.. ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఆ సమయంలో టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ విమర్శలు చోటు చేసుకున్నాయి. దీంతో ఈ హత్య కేసుపై సిట్ వేయ‌గా ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. అయితే, కేసును సీబీఐకి ఇవ్వాలని వైఎస్ జగన్, వివేకా భార్య సౌభాగ్యమ్మ, ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, వివేకా కుమార్తె సునీత పిటిష‌న్ వేయ‌డం...త‌న అన్న ప్ర‌భుత్వంపై న‌మ్మ‌కం లేక‌పోవ‌డం వల్లే జ‌రిగింద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు.
కేసు విచారణ తుది దశలో ఉందని ఈ సమయంలో సీబీఐ విచారణ అవసరం లేదని ఇప్పటికే కోర్టుకి  ప్రభుత్వం తెలిపింది. అయినా ఈ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. వివేకా కుమార్తె సునీత‌కు వైఎస్ జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌మ్మ‌, ఆయ‌న సోద‌రి ష‌ర్మిలా చాలా స‌న్నిహితం. ష‌ర్మిల‌, ఆమె భ‌ర్త అమెరికాకు వెళ్లిన‌పుడు సునీత వాళ్లింట్లోనే ఉన్నారు. అంత‌టి స‌న్నిహిత్యం ఉన్నప్పుడు ఈ కీల‌క నిర్ణ‌యం గురించి సునీత త‌న సోద‌రికి చెప్ప‌లేదా? ఒక‌వేళ చెప్పినా...ష‌ర్మిలా అడ్డుకోలేదా? అనేది స‌హ‌జంగానే చ‌ర్చనీయాంశం. ఏదేమైనా వైఎస్ కుటుంబంలోని లుక‌లుక‌లు మాత్రం ఈ పిటిష‌న్ ద్వారా తెర‌మీద‌కు వ‌స్తోందని అంటున్నారు.