కరోనా కలకలం... వైసీపీ ఎమ్మెల్యే బామ్మర్దికి పాజిటివ్

September 27, 2020

ప్రాణాంతక వైరస్ కోవిడ్- 19 పెను కలకలే రేపుతోంది. చైనాలో పుట్టి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనాను బాగానే కట్టడి చేస్తున్న ఏపీలో ఇప్పుడు మరో కలకలం రేగింది. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే బామ్మర్దికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇప్పుడు ఏపీలో నిజంగానే పెను కలకలం రేగిందని చెప్పాలి. ఇతర దేశాలు, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కరోనా విస్తృతి ఓ రేంజిలో ఉన్నా.. ఏపీలో మాత్రం జగన్ మోహన్ రెడ్డి సర్కారు తీసుకున్న ముందస్తు జాగ్రత్తల కారణంగా ఇక్కడ వైరస్ వ్యాప్తి అంతగా లేదనే చెప్పాలి. అయినా కూడా అక్కడక్కడ ఒక్కో కేసు బయటపడుతుండటంతో రాష్ట్రంలో కలకలం రేగుతూనే ఉందని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏకంగా రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే బామ్మర్దికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతోంది.

తాజాగా గుంటూరు జిల్లాలో ఓ పాజిటివ్ కేసు నమోదైన విషయం కలకలం రేపుతోంది. వృత్తి రీత్యా వ్యాపారి అయిన బాధితుడు ఇటీవలే రాజస్థాన్ లోని అజ్మీర్ షరీఫ్ దర్గాకు వెళ్లి వచ్చాడట. అక్కడి నుంచి వచ్చీ రాగానే జలుబు, జ్వరంతో బాదపడుతున్న నేపథ్యంలో అతడే స్వయంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడట. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి కరోనా కేసేనేమోనన్న అనుమానంతో జీజీహెచ్ కు తరలించారట. అక్కడ మరోమారు వైద్య పరీక్షలు చేయగా... అతడికి కరోనా పాజిటివ్ అని తేలిందట. దీంతో జీజీహెచ్ లోనే ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుకు అతడిని తరలించారట. ఇక్కడి దాకా బాగానే ఉన్నా... ఈ వ్యాపారి వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు స్వయానా బామ్మర్ది అని, ఎమ్మెల్యే సోదరి భర్తే అతడన్న విషయాన్ని తెలియడంతో అధికారులు షాక్ తిన్నారట.

ఎమ్మెల్యే బామ్మర్ది అయితే కరోనా సోకకూడదని లేదు కదా. దీంతో ఎమ్మెల్యే బామ్మర్ది అయిన సదరు బాదితుడిని ఐసోలేషన్ కు తరలించిన వైద్యులు.. విషయాన్ని ఎమ్మెల్యేకు తెలియజేయడంతో పాటుగా... ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేయాల్సిందేనని తీర్మానించారట. అంతేకాకుండా వారి ఫ్యామిలీ నుంచి ఇతరులకు వైరస్ సోకకూడదన్న భావనతో ఎమ్మెల్యేతో పాటు ఆయన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా క్వారంటైన్ లోకి పంపే దిశగా చర్యలు సాగుతున్నాయట. మొత్తంగా ఎమ్మెల్యే సమీప బంధువు, స్వయానా ఆయన సోదరి భర్తకు కరోనా సోకిందన్న వార్త నిజంగానే ఇప్పుడు వైరల్ గా మారిపోయింది.